నూతన క్రీడావిధానం అవసరం
నేడు జాతీయ క్రీడా దినోత్సవం

మనిషిని శారీరకంగా ఆరోగ్యంగా దృఢంగా ఉంచి మానసికంగా వికసింపచేసేవి క్రీడలు. క్రీడల ద్వారానే ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుంది.
శత్రుదేశాల్లో సైతం మన జాతీయ జెండాను సగర్వంగా ఎగుర వేయగలిగేది క్రీడాకారులు మాత్రమే.
ఆధునికత పేరుతో గ్రామీణ మారుమూల ప్రాంతాల సాంస్కృతిక కళా రంగాలపై ఎంతగా దాడి జరిగిందో పాశ్చాత్యీకరణ, కార్పొరేటీకరణ ప్రభావం ప్రజల జీవన శైలిపై ఎంత ప్రభావం చూపిందో మనం గమనిస్తున్నాం.
మన పిల్లల్ని మనం మార్కుల కొలబద్దలుగా భావిస్తున్నామే తప్ప వారిని భావిపౌరులుగా మానవ వనరులుగా చూడటం లేదు.
ర్యాంకుల సాధనలో స్కూలు, ట్యూషన్‌హోంవర్కులు తప్ప వారి మానసిక వికాసానికి శారీరక వ్యాయామానికి కావలసిన ఆటలను దూరం చేస్తున్నాం.
నేటితరం పిల్లలకు ఆటలు అంటే కేవలం కంప్యూటర్ గేమ్స్, వీడియో గేమ్స్ సెల్‌ఫోన్ గేమ్స్ తప్ప మరేవీ అందుబాటులో ఉండటం లేదు.
ఎప్పుడైనా సమయం దొరికితే అపార్‌మెంట్లలో గల్లీలో ఆడుకునే క్రికెట్‌తప్ప మరే ఇతర ఆటలంటే తెలియని స్థితి.నగరాల్లో, పట్టణాల్లో యావత్ దేశంలో క్రికెట్‌కు తప్ప పిల్లలకు ఆదరణ లేకుండాపోతుంది.
గ్రామీణ సాం ప్రదాయ క్రీడలు శారీరక శ్రమతోపాటు మానసికోల్లాసం ఇచ్చే క్రీడలన్నీ కనుమరుగైపోతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాలలోనూ జరిగిన అన్యాయమే తెలంగాణ క్రీడారంగానికి, క్రీడాకారులకు జరిగింది.
తెలంగాణ సంప్రదాయ క్రీడలు మాయ మైపోయాయి. తెలంగాణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభకు సరైన ప్రోత్సాహకాలు దక్కలేదు
. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అతికొద్ది కాలంలోనే ఈ అన్యాయాన్ని సవరించే దిశగా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. క్రీడలకు అధిక ప్రోత్సాహం ఇచ్చే విధంగా కొన్ని నిర్ణయాలు ప్రకటించింది.
విదేశాలకు వెళ్లే క్రీడాకారులకు మూడు లక్షల రూపాయలు ఖర్చుల కింద ఇవ్వడం, క్రీడాకారుల కు ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థలలో ప్రవేశానికి రెండు శాతం కోటా దక్కేలా ఆదేశాలు ఇవ్వడం, గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహకాలు దక్కలే చర్యలు తీసుకోవడంతోపాటు అనేక సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు సంవత్సరాల నుండి విశేషమైన కృషి చేస్తోంది.
ఇప్పుడు సమగ్ర కీడావిధానానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రీడాభివృద్ధిలో భాగంగా విద్యాలయాల్లో క్రీడలు తప్పనిసరి చేయాలి.
పాఠ్యాంశాల్లో క్రీడలు తప్పకుండా చేర్చాలి. ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో క్రీడా సౌకర్యాలు తప్పకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలి.
క్రీడా సంఘాలలో నిజమై క్రీడాకారులకు మాత్రమే ప్రాధాన్యత దక్కేలా, రాజకీయ నాయకుల జోక్యంలేని క్రీడాసంఘాలు ఉండేవిధంగా నిబంధనలు తీసుకురావాలి.
క్రీడా రంగం అభివృద్ధిఅంటే భారీ క్రీడామైదానాలు నిర్మించడం,పతకాలు సాధించిన వారికి భారీగా బహుమతులు ప్రకటించడం మాత్రమే కాకుండా ప్రైజ్‌మనీ టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారులకు కాకుండా దేశం కోసం ఆడి పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రాధాన్యత దక్కాలి.
మన రాష్ట్రంలో ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో స్పోర్ట్స్‌స్కూల్స్ ఉన్నాయి.
మిగతా అన్నిజిల్లాలో ప్రతి జిల్లాకు ఒక క్రీడా పాఠశాల ఏర్పాటు చేయాలి.ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ కింద లభ్యత ఉన్న నిధుల నుంచి దళిత గిరిజన క్రీడాకారులకు క్రీడా కార్యక్రమాలు రూపొందించాలి.
గిరిజనులకు సహజంగా అలవాటే ఆర్చరీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్ తదితర క్రీడాంశాల్లో అదేవిధంగా ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క జిల్లాలో కొన్ని క్రీడాంశలకు ప్రాధాన్యత ప్రవేశం అధికంగా ఉంటుంది.
వాటిని గర్తించి ప్రోత్సహించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతున్నది.
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడానగరం (స్పోర్ట్స్‌సిటీ)ని నిర్మించాలనే ముఖ్యమంత్రి ఆలోచన క్రీడా భవిష్యత్‌కు ఉపకరిస్తుంది.
-రూపా సురేష్
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/