యాదాద్రిలో పార్కింగ్‌ చార్జీల బాదుడు..గంటకు రూ.500

యాదాద్రి టెంపుల్ పున : ప్రారంభం కావడం తో భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా శని , ఆదివారాల్లో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ క్రమంలో ఆలయ సిబ్బంది భక్తులపై బాదుడు మొదలుపెట్టారు. యాదగిరి గుట్టపై వాహనాల పార్కింగ్ పేరుతో భక్తులను నిలువు దోపిడి చేసేందుకు డిసైడ్ అయ్యారు. కొండపై వాహనం పార్క్‌ చేస్తే గంటకు రూ.500, ఆ తర్వాత ప్రతి గంటకు రూ.వంద చొప్పున వసూలు చేయాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో తెలిపారు.

ఈ ఛార్జీలు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఉద్యోగులు, మీడియాకి మాత్రమే కొండపైన ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతోపాటు ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులకు ప్రోటోకాల్ ప్రకారం వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. అయితే ఆలయ కమిటీ ప్రకటించిన తాజా ధరలపై భక్తులు మండిపడుతున్నారు. దైవ దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులను పార్కింగ్ పేరుతో నిలువుదోపిడీ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.