తెలంగాణ లో 20 కి చేరిన ఓమిక్రాన్ కేసులు..ఒకరి పరిస్థితి విషమం

తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతుండడం తో ప్రభుత్వం మరింతగా దృష్టి సారించింది. ఒమిక్రాన్‌ అనుకున్నదానికన్నా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దేశంలో 150కి పైగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓమిక్రాన్ గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే 20 వరకు కేసులు నమోదయ్యాయి. వీరంతా విదేశాల నుంచి వచ్చిన వారే. జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో వీరందరికి ఓమిక్రాన్ సోకిందని తెలిసింది. అయితే తాజాగా తెలంగాణలో ఓ ఓమిక్రాన్ బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హుటాహుటీగా టిమ్స్ నుంచి గాంధీ ఆసుపత్రికి అధికారులు తరలించారు. గచ్చిబౌలిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతోంది. ఇప్పటికే పలుమార్లు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, వైద్య అధికారులతో సమావేశం అయ్యారు. ఓమిక్రాన్, థర్డ్ వేవ్ ముప్పుపై చర్చించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సమీక్షించారు. మరోవైపు వ్యాక్సిన్ వేగాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లను కూడా ఏర్పాటు చేశారు. పీపీఈ కిట్లను, మెడిసిన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ఇప్పటికే సెలవుల్లో ఉన్న వైద్య సిబ్బందికి సెలవును రద్దు చేసింది. సెలవులపై వెళ్లిన వారిని వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సంక్రాంతి తరువాత కేసులు పెరుగుతాయని వైద్యశాఖ అంచనా వేస్తోంది. రానున్న నెల రోజులు కీలకమని భావివస్తోంది.

మరోపక్క భారత సర్కార్ సైతం సోమవారం నుండి భారతదేశంలోని ఆరు విమానాశ్రయాలలో RT-PCR పరీక్ష ముందస్తు బుకింగ్ తప్పనిసరి చేయబడింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గత వారం జారీ చేసిన సూచనల ప్రకారం.. ‘రిస్క్’ దేశాల నుండి వచ్చే ప్రయాణికుల కోసం ఈ నిబంధనను అమలు చేశారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, ‘ఎయిర్ సువిధ’ పోర్టల్‌ను సవరించనున్నారు. తద్వారా ప్రమాదకర దేశాల నుండి వచ్చే వ్యక్తులు లేదా గత 14 రోజులలో అక్కడ నివసిస్తున్న వ్యక్తులు ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.

ఈ విమానాశ్రయాలు దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాలు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు .. హైదరాబాద్‌లలో కూడా ఉన్నాయి. ఇది ప్రోటోకాల్ అమలులో మొదటి దశ మాత్రమేనని, సిస్టమ్‌ను స్థిరీకరించి, ప్రయాణీకులకు ముందస్తు బుకింగ్‌లో పెద్దగా ఇబ్బంది కలగకుండా చూసుకున్న తర్వాత, ఇతర విమానాశ్రయాలకు కూడా నిబంధనను విస్తరించవచ్చని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. RT-PCR పరీక్ష సాధారణంగా ఒక వ్యక్తిలో కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్-19) ఉనికిని గుర్తించడానికి, ట్రాక్ చేయడానికి .. అధ్యయనం చేయడానికి అత్యంత ఖచ్చితమైన పరీక్షగా పరిగణించబడుతుంది.