భారత్-బంగ్లా మధ్య ‘మిథాలీ ఎక్స్‌ప్రెస్’ ప్రారంభించిన ఇరు దేశాల మంత్రులు..

ఇండియా- బంగ్లాదేశ్ ల ‘మిథాలీ ఎక్స్‌ప్రెస్’ రైలును ఇరు దేశాల మంత్రులు ప్రారంభించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, బంగ్లాదేశ్ రైల్వే మంత్రి మహ్మద్ నూరుల్ ఇస్లాం సుజోన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైలును ప్రారంభించారు. ప్రస్తుతం ప్రారంభించిన ‘ మిటాలి’ ఎక్స్ ప్రెస్ ఇరు దేశాల మధ్య మూడో రైలు. కరోనా కారణంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండేళ్లపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మార్చి 28, 2020 తర్వాత తొలిసారి మే 29, 2022న ఇరు దేశాల మధ్య ప్రయాణికుల రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. కోల్‌కతా-ఖుల్నా మధ్య బంధన్ ఎక్స్‌ప్రెస్, ఢాకా-కోల్‌కతా మధ్య మైత్రి ఎక్స్‌ప్రెస్ రాకపోకలు ఆదివారం మొదలయ్యాయి.

ఇక మూడో రైలు ‘మిథాలీ ఎక్స్‌ప్రెస్’ను ఇరు దేశాల రైల్వే మంత్రులు కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ రైలు భారత్‌లోని న్యూ జల్పాయ్‌గురి, బంగ్లాదేశ్‌లోని ఢాకా మధ్య 513 కిలోమీటర్ల దూరం రాకపోకలు సాగిస్తుంది. పర్యాటక రంగానికి కూడా ఈ రైలు సేవల వల్ల లబ్ధి చేకూరనుంది. ప్రతి ఆదివారం న్యూ జల్పాయ్‌గురి నుంచి బయల్దేరి వెళ్లే మిథాలీ ఎక్స్‌ప్రెస్.. తిరిగి సోమవారం ఢాకా కంటోన్మెంట్ నుంచి బయల్దేరి వస్తుంది. మళ్లీ బుధవారం భారత్ నుంచి బయల్దేరి వెళ్లి.. గురువారం బంగ్లాదేశ్ నుంచి తిరుగు ప్రయాణం అవుతుంది.