హెచ్‌ 1బీ వీసాలో కొత్త నిబంధనలు

H1B visa

వాషింగ్టన్‌: అమెరికాలో ఉపాధి ఆధారిత హెచ్1 బీ వీసాలపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు చట్టబద్దమైన వలసలను అరికట్టడంతో పాటు అమెరికా పౌరులకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు.. హెచ్1బీ వీసాలను తక్కువ సంఖ్యలో మాత్రమే జారీచేసేలా తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసారు. ఎంత మందికి హెచ్1బీ వీసాలు ఇవ్వాలి? కనీస వేతనం ఎంత చెల్లించాలి? అనే వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబ‌ర్ అధికారులు తెలిపారు.

హెచ్1బీ వీసాలకు సంబంధించి గత 20 ఏళ్లలో చేసిన అతి ముఖ్యమైన సంస్కరణ ఇది అని అమెరికా లేబర్ డిప్యూటీ సెక్రటరీ ప్యాట్రిక్ పిజ్జెల్లా వెల్లడించారు. ఈ ఆంక్షలు త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉందనీ తెలిపారు. సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది అమెరికా ప్ర‌భుత్వం సుమారు 85వేల హెచ్‌1బీ వీసాల‌ను జారీ చేస్తుంటుంది. అయితే తాజా నియ‌మావ‌ళి ప్ర‌కారం ఆ సంఖ్య‌ను పావు వంతు త‌గ్గిస్తున్న‌ట్లు హోమ్‌ల్యాండ్ యాక్టింగ్ డిప్యూటీ సెక్ర‌ట‌రీ కెన్ కుసినెల్లి తెలిపారు. మూడో వంతు దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయని వెల్లడించారు. ఏటా జారీ అయ్యే 85వేల హెచ్1 బీ వీసాల్లో చైనా, భారతీయ పౌరులే దాదాపు 50వేల వీసాలు పొందుతుంటారు. ఐతే ఈ వీసాలను అమెరికా తగ్గించనుండడంతో ఇరు దేశాల టెకీలపై తీవ్ర ప్రభావం పడనుంది. కాగా, ఈ కొత్త నిబంధనల వల్ల ఏటా వచ్చే హెచ్‌ 1బీ వీసా దరఖాస్తుల సంఖ్యలో మూడో వంతు తగ్గవచ్చని డీహచ్‌ఎస్‌ అధికారులు భావిస్తున్నారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/