టాలీవుడ్ లో కొత్త మార్గదర్శకాలు

,

నెల రోజులుగా చిత్రసీమలో షూటింగ్ లు బంద్ చేసి..నిర్మాతలు పలు నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. సినిమా బడ్జెట్ లు తగ్గించుకోవడం.. ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ , ఓటిటి రిలీజ్స్ వంటి పలువాటిపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్టు 25 నుంచి సినిమా షూటింగ్ మొదలుకాగా..ఈరోజు నుండి పూర్తిస్థాయి లో మొదలుపెట్టారు. కాగా, సినిమాల సందడి మళ్లీ మొదలైన నేపథ్యంలో, చిత్ర నిర్మాణాలకు సంబంధించి తెలుగు ఫిలిం చాంబర్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు సెప్టెంబరు 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

కొత్త మార్గదర్శకాలు ఏంటి అనేవి చూస్తే..

  • ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు రోజువారీ చెల్లింపులు ఉండవు.
  • ఓ చిత్రం, అందులోని పాత్రల స్థాయి ఆధారంగా నటీనటుల పారితోషికాలను నిర్మాతలు నిర్ణయిస్తారు. ఆ పారితోషికంలోనే నటీనటుల పర్సనల్ స్టాఫ్, లోకల్ ట్రాన్స్ పోర్టు, స్థానికంగా బస, స్పెషల్ ఫుడ్ ఖర్చులు అన్నీ ఇమిడి ఉంటాయి.
  • ఓ ఆర్టిస్టుతో కుదుర్చుకున్న పారితోషికం ఒప్పందానికి మించి నిర్మాత ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరంలేదు.
  • ఓ సినిమాకు పనిచేసే ప్రధాన టెక్నీషియన్ల పారితోషికాల్లోనే వారి పర్సనల్ స్టాఫ్ ఖర్చులు, స్థానిక బస, లోకల్ ట్రాన్స్ పోర్టు, స్పెషల్ ఫుడ్ ఖర్చులు ఇమిడి ఉంటాయి. ముందు ఒప్పందం కుదుర్చుకున్న మేరకు తప్ప నిర్మాత అదనంగా చెల్లించాల్సినదేమీ ఉండదు.
  • ప్రతి అగ్రిమెంట్ లోనూ పారితోషికం వివరాలు కచ్చితంగా ఉండాలి. ఆ వివరాలను చాంబర్ నిర్ధారించాల్సి ఉంటుంది

ఓటీటీ…

  • ఓ సినిమా టైటిల్స్ లో, థియేట్రికల్ రిలీజ్ ప్రచారంలో ఓటీటీ, శాటిలైట్ భాగస్వాముల పేర్లు ఉండవు.
  • ఒక సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాల్సి ఉంటుంది.

థియేటర్లు/ఎగ్జిబిటర్ల అంశాలు..

  • వీపీఎఫ్ కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 3న జరగాల్సిన తదుపరి సమావేశం 6వ తేదీకి వాయిదా పడింది.
  • తెలంగాణలో ఇచ్చినంత పర్సెంటేజీనే ఆంధ్రాలోని మల్టీప్లెక్సులకు కూడా ఇవ్వడం జరుగుతుంది.

ఫెడరేషన్…

  • చర్చలు తుది అంకంలోకి ప్రవేశించాయి. ఆమోదించబడిన, ఖరారు చేయబడిన రేట్ కార్డులు అన్ని చిత్ర నిర్మాణ సంస్థల కార్యాలయాలకు అందజేస్తారు.