దక్షిణాఫ్రికాలో హడలెత్తిస్తున్న ‘ఒమిక్రాన్’

ఒమిక్రాన్… కరోనా కొత్త వేరియంట్ కు నామకరణం చేసిన డబ్ల్యూహెచ్ఓ

జెనీవా : మొన్నటిదాకా కరోనా డెల్టా వేరియంట్ తో బెంబేలెత్తిపోయిన ప్రపంచ దేశాలను ఇప్పుడు కొత్త వేరియంట్ భయాందోళనలకు గురిచేస్తోంది. 32 మ్యుటేషన్లతో శాస్త్రవేత్తలను సైతం నివ్వెరపరుస్తున్న ఈ బి.1.1.529 సూపర్ స్ట్రెయిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘ఒమిక్రాన్’ అని నామకరణం చేసింది. ఒకసారి కరోనా వచ్చిన వారికి కూడా ఇది సోకే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దీంట్లో పెద్ద సంఖ్యలో జన్యు ఉత్పరివర్తనాలు ఉండడం ఆందోళన కలిగించే అంశమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

ఒమిక్రాన్ మొదట దక్షిణాఫ్రికాలో ఉనికిని చాటుకుంది. నవంబరు 9న ఓ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలో బి.1.1.529 వేరియంట్ నిర్ధారణ అయింది. ఆపై బోట్సువానా, హాంకాంగ్ దేశాల్లోనూ ఇది వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలపై అనేక దేశాలు నిషేధం విధించాయి. తాజా పరిణామాలపై డబ్ల్యూహెచ్ఓ స్పందిస్తూ, ఒమిక్రాన్ వేరియంట్ ఎంత ప్రభావం చూపిస్తుందన్నది తెలుసుకోవాలంటే మరికొన్ని వారాలు పడుతుందని వెల్లడించింది.

బ్రిటన్ కు చెందిన ఆరోగ్య శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, వ్యాక్సిన్లు కూడా కొత్త వేరియంట్ ను ఏమీ చేయలేవని అన్నారు. ఆక్స్ ఫర్డ్ వర్సిటీకి చెందిన జేమ్స్ నెయిస్మిత్ అనే ప్రొఫెసర్ స్పందిస్తూ, బి.1.1.529లోని జన్యు మార్పులను పరిశీలిస్తే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు కలిగి ఉన్నట్టు తెలుస్తోందని వివరించారు.

అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ చీఫ్ డాక్టర్ ఆంటోనీ ఫౌచీ కూడా కొత్త వేరియంట్ పై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నివేదికలు కొత్త రకం కరోనాపై ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నాయని, వ్యాక్సిన్లను మరింత శక్తిమంతంగా రూపొందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్లు దీన్ని ఏమేరకు నిలువరిస్తాయన్నది మరింత క్షుణ్ణంగా పరిశోధించాల్సి ఉందని అన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/