బ్రిటన్‌ ఎంపీలకు నూతన డ్రెస్‌ కోడ్‌

లండన్: బ్రిటన్‌ పార్లమెంట్‌ తమ ఎంపీలకు కొత్త డ్రెస్‌ కోడ్‌ను అమల్లోకి తెచ్చింది. కొవిడ్‌ నుంచి కోలుకోవడంతో ఎంపీలు సోమవారం నుంచి పార్లమెంట్‌కు రావడం మొదలుపెట్టారు. ఇవాల్టి నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి కార్యాచరణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇలాఉండగా, పార్లమెంట్‌ గౌరవాన్ని మరింత ఇనుమడింప జేసేందుకు కొత్త డ్రెస్‌ కోడ్‌ను స్పీకర్‌ సర్‌ లిండ్సే హూయిల్‌ అమలులోకి తెచ్చారు. కొవిడ్ లాక్‌డౌన్‌ సమయంలో సడలింపుల వల్ల కలిగిన అలసత్వాన్ని పరిష్కరించేందుకు ఈ డ్రెస్‌ కోడ్‌ను అమలులోకి తెచ్చినట్లు అధికారులు చెప్తున్నారు.

పురుష ఎంపీలు టై-జాకెట్లు ధరించాలి. సాధారణ బూట్లు ధరించకూడదు. జీన్స్‌, చినోస్‌, స్పోర్ట్స్‌ వేర్‌ ఇతర ప్యాంట్లను ధరించడం మానుకోండి. టై తప్పనిసరిగా ధరించాలి. మహిళా ఎంపీలు టీ-షర్టులు, స్లీవ్‌లెస్‌ టాప్‌లు ధరించకూడదు. సమావేశ మందిరంలో బ్రాండ్ల పేర్లతో ఉన్నవిగానీ, నినాదాలు రాసి ఉన్న టీషర్టులు, బ్యాడ్జ్‌లు ధరించకూడదు. సభలో చర్చ జరుగుతున్నప్పుడు ఎంపీలు పుస్తకాలు లేదా వార్తాపత్రికలు చదువకూడదు. మహిళలు, పురుషులు ఎంపీ ఛాంబర్‌కు బ్యాగులు, బ్రీఫ్‌కేసులు, పెద్ద హ్యాండ్‌బ్యాగులు తీసుకురాకూడదు. ఎంపీలు ఛాంబర్‌లోకి ప్రవేశించే సమయంలోగానీ, బయటకు వెళ్లేప్పుడుగానీ సభకు గౌరవ సూచకంగా చైర్‌ ముందు నమస్కరించాలి. అదేవిధంగా, ఎంపీలు మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సభా ప్రాంగణంలో ఉపయోగించకూడదు. చప్పట్లు కొట్టడం నిషేధం. పాటలు పాడటం లేదా భజన-కీర్తనలు అనుమతించబడదు. 2019 సెప్టెంబర్‌లో లేబర్ పార్టీ ఎంపీ ఒకరు సభలో పాటలు పాడి నిరసన తెలుపడంతో పాటలు పాడటంపై కూడా నిషేధం విధించారు.

తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/specials/career/