నేపాల్ లో అదృశ్యమైన విమానం కోవాంగ్ గ్రామంలో కూలింది

నేపాల్‌లో తారా ఎయిర్ 9 NAET ట్విన్-ఇంజిన్ విమానం విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం ఉదయం పోఖారా నుంచి నేపాల్‌లోని జోమ్‌సోమ్‌కు వెళ్తుండగా ఉదయం 9.55 గంటలకు ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. విమానాన్ని ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ప్రాంతంలో మొదట గుర్తించామని, తర్వాత మౌంట్ ధౌలగిరి వైపు మళ్లిందని.. ఆ తర్వాతే ఏటీసీతో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు చెప్పుకొచ్చారు. సాయంత్రం కొవాంగ్ సమీపంలో విమాన శకలాలను అధికారులు గుర్తించారు.
ముస్టాంగ్ సమీపంలోని కోవాంగ్ గ్రామంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేపాల్ విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు. విమానం కూలిందని భావిస్తున్న ప్రదేశంలో భారీగా మంచు కురుస్తున్న కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోందని చెప్పారు. విమానం కూలిపోయిందని స్థానికులు.. నేపాల్ సైన్యానికి సమాచారం అందించారు. మనపథి హిమాల్ పర్వత శ్రేణుల్లోని లమ్‌చే నది దగ్గర కూలిపోయినట్లు స్థానికులు చెప్పినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. భారీ శబ్ధం వినిపించిందని టిటి ప్రాంత ప్రజలు సమాచారం అందించారని ముస్టాంగ్ పోలీసులు తెలిపారు. విమానంలో మొత్తం 22 మంది ఉన్నారు. అందులో నలుగురు భారతీయులు, జపాన్‌కు చెందిన వారు ముగ్గురు, సిబ్బందితో సహా 15 మంది నేపాలీ పౌరులు ఉన్నారు.