పబ్‌జి గేమ్‌ను నిషేధించిన నేపాల్‌!

pubg game
pubg game


ఖాట్మండు: పాపులర్‌ మొబైల్‌ గేమ్‌ పబ్‌జిపై నేపాల్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ గేమ్‌పై ఆ దేశంలో నిన్నటి నుంచి నిషేధం అమలులోకి వచ్చింది. పిల్లలపై ఈ గేమ్‌ చెడు ప్రభావం చూపుతుందని అందుకే ఈ గేమ్‌ను నిషేధించామని నేపాల్‌ టెలికమ్యూనికేషన్స్‌ అథారిటీ డిప్యూటి డైరెక్టర్‌ సందీప్‌ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆ దేశానికి చెందిన ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ నుంచి అందిన విన్నపం మేరకు నేపాల్‌లో ఉన్న అందరు ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, మొబైల్‌ ఆపరేటర్లు, నెట్‌వర్క్‌ సర్వీసు ప్రొవైడర్లకు పబ్‌జి గేమ్‌ స్ట్రీమింగ్‌ను బ్లాక్‌ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. ఐతే ఈ గేమ్‌ వల్ల ఎలాంటి ప్రమాదకరమైన ఘటనలు జరగనప్పటికీ పిల్లల చదువులకు, ఇతర కార్యకలాపాలకు ఈ గేమ్‌ తీవ్రంగా ఆటంకం కలిగిస్తున్నదని భావించినందునే ఈ గేమ్‌ను నిషేధించామని సందీప్‌ అధికారి తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/