నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీల గొడవ

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీల గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి. నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ గ్రూపుల మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరినట్లు తెలుస్తుంది. నెల్లూరు మన్సిపల్ అధికారులు మంత్రి కాకాణి ఫ్లెక్సీని తీసేయడం కూడా వివాదానికి దారి తీసింది. ఇది అనిల్ చేయించిన పనే అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ మొత్తం వ్యవహారంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. నెల్లూరు జిల్లా వైసీపీలో ఎలాంటి వర్గాలు లేవంటున్నారు. పార్టీలో ఉన్నవారంతా జగన్‌ సైనికులే అంటున్నారు అనిల్. అసలు గ్రూపులు కట్టాల్సిన అవసరం త‌మ‌కు లేదని అదంతా గిట్టని మీడియా చేస్తున్న దుష్ప్రచార‌మేనని మండిపడ్డారు. ఇది సర్దుమణిగిందని అనుకునేలోపే మరో ఘటన చోటుచేసుకుంది.

సోమవారం రాత్రి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మద్దతుదారులు నెల్లూరులోని ముత్తుకూరు రోడ్ సర్కిల్ లో ఫ్లెక్సీ పెట్టారు. అయితే, వాటిని ఎవరో చించేయడంతో ఆయన అనుచరులు మండిపడుతున్నారు. ఇటీవల కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రి పదవి చేపట్టడంతో ఆయన మద్దతుదారులు ఫ్లెక్సీలు పెట్టారు. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు వాటిని తొలగించిన సంగతి తెలిసిందే. మరి ఈ ఫ్లెక్సీ వివాదం ఎంతదూరం వెళ్తుందో.. ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.