నెల్లూరులో యాసిడ్‌ దాడికి గురైన మైనర్‌ బాలికను చెన్నైకి తరలింపు

నెల్లూరు జిల్లాలో యాసిడ్ దాడికి గురై చికిత్స తీసుకుంటున్న బాలికను మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలికపై ఒక దుర్మార్గుడు అత్యాచారానికి ప్రయత్నించి… ఆమె ప్రతిఘటించటంతో నోట్లోను, ముఖం మీద యాసిడ్‌ పోసి.. ఆపై గొంతు కోసి పరారయ్యాడు.

ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో..మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ఇక ఈ దారుణ ఘటనకు పాల్పడింది బాలిక మేనమామ నాగరాజుగా గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కూతురిపై నాగరాజు అఘాయిత్యానికి పాల్పడ్డాడని తండ్రి ఆరోపిస్తున్నారు. అఘాయిత్యానికి ఒడిగట్టి దాడి చేశాడని.. ఆస్పత్రికి తరలించే సమయంలో నాగరాజు అక్కడే ఉన్నాడని చెబుతున్నాడు. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని.. తన కూతురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నట్లు తండ్రి వివరించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తండ్రి డిమాండ్ చేస్తున్నారు.

ఈ దాడిని టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇంట్లో ఉన్నప్పటికీ ఏపీలో ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేదని ఇంకోసారి రుజువైంది. అత్యాచార ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు అమలుచేస్తే ఇటువంటి నేరాలు పునరావృతం కావు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఏపీలో నేరాల రేటు పెరిగిందని జాతీయ గణాంకాలు మొన్ననే చెప్పాయి. ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ నేరాల నియంత్రణకు చిత్తశుద్ధితో పనిచేయక పోవడంతో నేరగాళ్ళ విచ్చలవిడితనం పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసారు.

నేరం చేసిన పార్టీ రౌడీలను వెనకేసుకు రావడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరి పైనా అక్రమకేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ శాంతి భద్రతలు కాపాడటంలో ఎందుకు లేదు? బాలికపై ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాలికకు మెరుగైన వైద్యం అందించాలి. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలన్నారు చంద్రబాబు.