కార్మిక నేతగా, రాజకీయ నాయకుడిగా సుదీర్ఘకాలం సేవలు

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన నాయిని నర్సింహారెడ్డి

Nayini Narasimha reddy-File

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మాజీ హోం మంత్రి, కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి గత రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయనకు భార్య అహల్య, కుమారుడు దేవేందర్‌రెడ్డి, కుమార్తె సమతారెడ్డి ఉన్నారు. నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం రామ్ నగర్ డివిజన్ కు కార్పొరేటర్ గా వ్యవహరిస్తున్నారు. కరోనా సోకిన నాయిని, దాన్నుంచి కోలుకున్న తరువాత న్యుమోనియా బారినపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. గడచిన వారం రోజులుగా ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స జరుగుతూ ఉండగా, పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ ను అమర్చి చికిత్సను అందించారు. బుధవారం నాడు సిఎం కెసిఆర్‌ కూడా వెళ్లి ఆయన్ను పరామర్శించి వచ్చారు. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత నాయిని పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించారు.నాయిని మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

నాయిని తొలుత కార్మిక నేతగా, ఆపై రాజకీయ నాయకుడిగా సుదీర్ఘకాలం సేవలందించిన నాయిని, ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో హేమాహేమీలుగా పేరున్న వారిని ఓడించి, చరిత్ర సృష్టించారు. ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరఫున నాటి కార్మిక మంత్రి టి. అంజయ్య, రెడ్డి కాంగ్రెస్ తరఫున మాజీ కార్మిక మంత్రి జి.సంజీవరెడ్డిలు పోటీ పడగా, వారిని ఢీకొన్న నాయిని 2,167 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు.

ఆపై 1985లో, 2004లో అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో వైఎస్ సీఎంగా ఉన్న వేళ, సాంకేతిక విద్యా మంత్రిగా పనిచేసిన నాయిని, కేబినెట్ నుంచి టిఆర్‌ఎస్‌ వైదొలగిన వెంటనే, తన రాజీనామాను గవర్నర్ కు పంపారు. ఆ సమయంలో అమెరికాలో ఉన్న నాయిని, పార్టీ నిర్ణయాన్ని గౌరవించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తన నిబద్ధతను చాటుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌ వెన్నంటి నిలిచిన ఆయన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

నల్గొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్మలో జన్మించిన నాయిని, హెచ్ఎస్సీ వరకూ విద్యను అభ్యసించారు. ప్రగతిశీల ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనే నాయిని, 1958లో సోషలిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అదే ఆయన జీవితాన్ని మార్చివేసింది. నాటి సోషలిస్ట్ నేత బద్రి విశాల్ పిత్తి కోరిక మేరకు తొలిసారిగా 1970లో హైదరాబాద్ కు వచ్చి, సోషలిస్ట్ పార్టీ ఆఫీసు బాధ్యతలు స్వీకరించారు. తొలుత జాయింట్ సెక్రటరీగా, ఆపై రాష్ట్ర కార్యదర్శిగానూ పనిచేసి, కార్మిక నేతగా మారారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/