శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై జాతీయ మహిళా కమిషన్ సీరియస్

శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఆమె ఫై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖాశర్మ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి లేఖ రాశారు. ఇటీవల కాలంలో శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ నిత్యం వివాదస్పదంగా నిలుస్తూ వస్తున్నారు.

తాజాగా ఓ భ‌క్తురాలి ప‌ట్ల అనుచితంగా ప్రవర్తించడం ఫై యావత్ ప్రజలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 10 అవుతున్నా హోటల్ ఎందుకు తెరిచి ఉంచారని, నీ భర్త ఆచూకీ చెప్పాలని ధనలక్ష్మి అనే మహిళను విచక్షణా రహితంగా కొట్టి, పోలీస్ స్టేషన్ కు తరలించారు సీఐ.. తన ఆరోగ్యం భాగోలేదని.. ఆపరేషన్‌ అయ్యిందంటూ ఆ మహిళ మొరపెట్టుకున్నా కనికరించకుండా విరుచుకుపడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నడి రోడ్డుపై మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించి, చీర ఊడిపోయేలా కొట్టి, బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కించిన దృశ్యాలను స్థానికులు మొబైల్ ఫోన్లో చిత్రీకరించడంలో సీఐ అంజూ యాదవ్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.

ఈ విషయం మానవ హక్కుల కమిషన్ వరకూ వెళ్లడంతో.. విచారణ చేపట్టాలని తిరుపతి ఎస్పీ ఆదేశించారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన ఎస్పీ విమలకుమారి.. బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులను విచారిస్తున్నారు. మొత్తం ఇప్పటివరకూ 15 మందిని ప్రశ్నించారు. దర్యాప్తు పూర్తయ్యాక రిపోర్ట్ ఇస్తామన్నారు అడిషనల్ ఎస్పీ విమలకుమారి. అయితే తాను ఏ తప్పూ చేయలేదంటున్నారు సీఐ అంజు యాదవ్. ధనలక్ష్మిని కొట్టలేదంటున్నారు. విచారణ కోసం వెళితే ఆమే తన పట్ల దురుసుగా ప్రవర్తించిందని ఆరోపించారు.