నారా లోకేష్ యువగళం 21వ రోజు హైలెట్స్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ గత 20 రోజులుగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. లోకేష్ యాత్ర కు ప్రజల నుండి విశేష స్పందన వస్తుండడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. లోకేష్ సైతం ఎక్కడ తగ్గకుండా ప్రజల కష్టాలను అడిగితెలుస్కుంటూనే, జగన్ సర్కార్ ఫై నిప్పులు చెరుగుతున్నారు. ఈరోజు 21వ రోజుకు యాత్ర చేరుకుంది. ప్రస్తుతం లోకేష్‌ సత్యవేడు నియోజకవర్గంనుంచి పాదయాత్ర సాగిస్తున్నారు. ఈ ఉదయం రాయపేడు విడిది కేంద్రంనుంచి పాదయాత్ర మొదలైంది. పాదయాత్రకు ముందు ప్రతి రోజూలాగే లోకేష్‌ సెల్ఫీల కార్యక్రమాన్ని చేపట్టారు. 1000మందితో ఫొటోలు దిగారు. అనంతరం యువతీయువకులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.

కేవీబీ పురంలో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి నారా లోకేష్ మాట్లాడారు. రాజుల కండ్రిగలో స్థానికులతో మాటామంతీ నిర్వహించారు. అనంతరం రాజుల కండ్రిగ గ్రామం సమీపంలోని హార్టి కల్చర్ రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో లోకేష్‌ పాల్గొన్నారు. మధ్యాహ్నం రాగిగుంటలో భోజనం విరామం తర్వాత పాదయాత్ర మళ్లీ మొదలైంది. తర్వాత తిమ్మనాయుడు ముదిరాజ్ కులస్తులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించామని , స్వయం ఉపాధిని ప్రోత్సహించామని లోకేష్ చెప్పుకొచ్చారు. అమరరాజా పక్క రాష్ట్రానికి పోయిందని, 20 వేల మంది రాయలసీమ యువతకు ఉద్యోగ అవకాశాలు పోయాయని అన్నారు.