సీఎం జగన్‌కు లేఖ రాసిన నారా లోకేశ్
తాడేపల్లి రైల్వే స్థలాల్లోని వారికి న్యాయం చేయాలి..లోకేశ్
Nara Lokesh wrote a letter to CM Jagan
అమరావతి: సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ ఓ లేఖ రాశారు. ‘గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రైల్వే స్థలాల్లోని వారికి ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీ మేరకు వేరేచోట ఇళ్లు కట్టి తరలించేవరకు రైల్వే అధికారులు ఇళ్లు కూల్చకుండా సమయం ఇచ్చేలా తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి లేఖ రాశాను’ అని లోకేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘నలభై ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న అట్టడుగువర్గాలకి చెందిన నిరుపేదలని ఒక్కరోజులో ఇళ్లు ఖాళీ చేయాలని రైల్వే అధికారులు తాఖీదులు ఇచ్చారు. దీనిపై అత్యవసరంగా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది.
2019 ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మీ నాయకులు ఈ రైల్వే స్థలంలో ఉన్న పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. కూలికెళితేకానీ కూడు దొరకని నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 650 కుటుంబాల సమస్యని వెంటనే పరిష్కరించాలి. మీ ఎమ్మెల్యే ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీ మేరకు 650 మందికి వేరే చోట ఇళ్లు కట్టి తరలించేవరకూ ఇక్కడే నివాసం వుండేలా రైల్వే అధికారులని ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని లోకేశ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/