చేతికి సంకెళ్లతో లోకేశ్‌ నిరసన

వైఎస్‌ఆర్‌సిపి పాలనలో రైతులకు సంకెళ్లు వేస్తున్నారంటూ ఆగ్రహం

Nara Lokesh with tdp leaders protest

అమరావతి: టిడిపి నేత నారా లోకేశ్‌ ఏపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైఎస్‌ఆర్‌సిపి పాలనలో రైతులకు సంకెళ్లు వేస్తున్నారంటూ లోకేశ్‌ తన చేతికి సంకెళ్లు వేసుకుని ప్రభుత్వ తీరు పట్ల టిడిపి నేతలతో కలిసి ఈ రోజు ఆయన నిరసన తెలిపారు. ఏపీలో వివిధ వర్గాలపై ప్రభుత్వం దాడులు చేయిస్తోందని, అసెంబ్లీలోకి మీడియా నియంత్రణను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు అధ్యక్షతన టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం నుంచి అసెంబ్లీ వరకు కాలినడకన ర్యాలీలో పాల్గొని ఈ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా దాడులు ఆపాలని, అసెంబ్లీలోకి అన్ని మీడియా సంస్థలను అనుమతించాలని వారు డిమాండ్‌ చేశారు.

‘రాక్షస పాలనలో రావణకాష్టం. 18 నెలల వైఎస్ జగన్ పాలనలో రైతులకు సంకెళ్లు, దళితులకు శిరోముండనం, మైనార్టీలు ఆత్మహత్యలు చేసుకునేలా వేధించడం, మహిళలపై అఘాయిత్యాలు’ అని లోకేశ్ విమర్శించారు. ‘రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసన తెలిపాం’ అని లోకేశ్ చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/