‘జగనాసుర.. నేరం ఒప్పుకో.. బాబాయ్ ని చంపిన పాపం ప్రక్షాళన చేసుకో’ – నారా లోకేష్

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై నేటికి నాలుగేళ్లు పూర్తి అయ్యింది. ఇప్పటివరకు హత్య చేసిన వారికీ శిక్ష పడలేదు. కోర్ట్ లలో ఈ కేసు ఫై విచారణ జరుగుతూనే ఉంది. ఈక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా జగన్ ఫై ఓ ట్వీట్ చేసారు.

” గొడ్డలి మీదే, వేటు వేసింది మీరే. మీ చేతులకు అంటిన రక్తం మరకలు మాకు అంటించాలని చూశావు. ఆధారాలు చెరిపేశావు. జనాల్ని నమ్మించేశాం అనుకున్నావు. గూగుల్ టేక్ అవుట్ కి దొరికేశావు. ఇంకెన్నాళ్లీ తప్పుడు రాతలు, దాగుడుమూతలు జగనాసుర. నేరం ఒప్పుకో.. బాబాయ్ ని చంపిన పాపం ప్రక్షాళన చేసుకో” అని అంటూ పోస్ట్ పెట్టారు.

అలాగే చంద్రబాబు సైతం ట్వీట్ చేసారు. వైఎస్ వివేకా హత్యకు కుట్ర జరిగింది ఆ ఇంట్లోనేనని, ఇది జగనాసుర రక్త చరిత్రేనని చంద్రబాబు విమర్శించారు. తండ్రి శవం పక్కన ఉండగానే సీఎం పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి, బాబాయి హత్యతో రాజకీయ లబ్ది పొందిన వ్యక్తి ఇప్పుడు ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా అంటూ వివేకా హత్య పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.

తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు సంస్థలను ఎవ్వరూ ప్రభావితం చేయవద్దని డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా తండ్రి సమాధి వద్ద ఆమె నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘మా నాన్న చనిపోయి ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు అవుతోంది. మాకు న్యాయం జరిగేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నాన్న చనిపోయిన మొదట్లో కడప, కర్నూలులో ఇలాంటి సంఘటనలు ఇది మామూలే కదమ్మా.. ఎందుకు ఇలా ఆందోళన చెందుతున్నారని నాతో కొందరు అన్నారు. కానీ, అది తప్పు అని నిరూపించేందుకే నేను ప్రయత్నం చేస్తున్నా. ఇలాంటి పరిస్థితి మరెవరికీ జరగకూడదనే నా పోరాటం. ఇది ఒకరిమీద కక్షతో చేసేది కాదు. నిజం అందరికీ తెలియాలనే ఈ పోరాటం చేస్తున్నా. నిజం బయటికి వస్తే భవిష్యత్తులో మరెవరికీ ఇలాంటిది జరగదు. మరో కుటుంబాన్ని కాపాడిన వాళ్లం అవుతాం’ అని ఆమె అభిప్రాయపడ్డారు.