మా సభ్యులను సస్పెండ్ చేసి మద్యంపై చర్చ : లోకేశ్

దమ్ముంటే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చి చర్చ జరపాల‌న్న లోకేశ్‌

కీవ్: కల్తీ సారా, జే బ్రాండ్ మరణాలు అన్నీ హత్యలేనంటూ అసెంబ్లీ ఎదుట టీడీపీ శాసన మండలి సభ్యులమంతా క‌లిసి నిరసన తెలిపామ‌ని టీడీపీ నేత నారా లోకేశ్ పేర్కొన్నారు. ‘మా సభ్యులను సస్పెండ్ చేసి మద్యంపై వైస్సార్సీపీ చర్చ జ‌రిపింది. దీంతో జగన్ రెడ్డికి ఉన్న‌ భయం బయటపడింది. సహజ మరణాలు అంటూ ఫేక్ మాటలు మాట్లాడటం మాని దమ్ముంటే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చి చర్చ జరపాలి’ అని నారా లోకేశ్ సవాల్ చేశారు.

కాగా, టీడీపీ స‌భ్యులు శాస‌న మండ‌లిలోనూ నేడు ఆందోళ‌న తెలిపారు. దీంతో సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారంటూ టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ తెలిపారు. సస్పెండ్ అయిన వారిలో అర్జునుడు, అశోక్‌ బాబుతో పాటు దీపక్‌ రెడ్డి, ప్రభాకర్‌, రామ్మోహన్‌, రామారావు, రవీంద్రనాథ్‌ ఉన్నారు.

మ‌రోవైపు, టీడీపీ నేత‌ అచ్చెన్నాయుడు ఏపీలో క‌ల్తీసారాపై మీడియాతో మాట్లాడారు. ‘అసలు ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా? కల్తీ సారా వల్లే మరణించారని మృతుని కుటుంబ సభ్యులు చెప్పిన తరువాత, అన్ని రాజకీయ పార్టీలు ఇది కల్తీ మరణాలే అని తేల్చిన తరువాత కూడా జగన్ రెడ్డి సిగ్గు లేకుండా, ఇవి సహజ మరణాలే అంటూ శాసనసభలో చులకన చేసి మాట్లాడటం అత్యంత దారుణం’ అని ఆయ‌న మండిప‌డ్డారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/