కుప్పం వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు

టీడీపీ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. జనవరి 27 నుండి పాదయాత్ర ను మొదలుపెట్టబోతున్నారు. పాదయాత్రకు ముందు లోకేష్ కుప్పం వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ నెల 27 మధ్యాహ్నం 12 గంటలకు లోకేశ్ పాదయాత్ర షురూ కానుంది. అనంతరం సాయంత్రం 4:45 గంటలకు పార్టీ ఆఫీస్ నుండి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 400 రోజులు 4 వేల కిలోమీటర్లు కొనసాగనుంది. కుప్పం నియోజకవర్గంలో మూడ్రోజుల పాటు 29 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర కొనసాగనుంది.

ప్రస్తుతం ఏపీలో ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోతున్నాయి. 175 కు 175 అంటూ అధికార వైస్సార్సీపీ ప్రజల్లోకి వెళ్తుంది. ఇక టీడీపీ, జనసేన పార్టీలు కూడా స్పీడ్ ను పెంచాయి. ఇదేం ఖర్మం పేరుతో చంద్రబాబు ఇప్పటికే జిల్లాల పర్యటన చేస్తుండగా.. మరోవైపు నారా లోకేశ్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకోడంలో భాగంగా యువగళం పేరుతో ప్రత్యేక జెండా రూపకల్పన చేశారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఇతర అంశాలను ఇందులో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు నేతలు చెప్పారు. రాజధాని నిర్మాణం, రైతాంగం, పెట్టుబడులు, ఆర్థికపరిస్థితి, మహిళల సమస్యలు వంటి అంశాలు ఇందులో ఉండనున్నాయి. యువతను పెద్దఎత్తున పాదయాత్రలో భాగస్వామ్యం చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు.