జ‌గ‌న్‌కు లేఖ‌ రాసిన నారా లోకేశ్

విద్యుత్ కోత‌ల‌తో అన్ని రంగాల‌కు తీవ్ర న‌ష్టమన్న లోకేశ్

అమరావతి: టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ సీఎం జగన్ కు లేఖ రాశారు. విద్యుత్ కోత‌ల‌తో రాష్ట్రం విల‌విల్లాడుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విద్యుత్ కోత‌ల‌తో రాష్ట్రంలోని అన్ని రంగాలు కూడా తీవ్రంగా న‌ష్ట‌పోతున్నాయ‌ని చెప్పిన లోకేశ్.. ఇప్ప‌టికైనా ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించి ప‌వ‌ర్ హాలిడేల‌ను ఎత్తివేయాల‌ని సీఎం జ‌గ‌న్ ని కోరారు. ఈ మేర‌కు సీఎంకు లోకేశ్ ఈరోజు ఓ లేఖ రాశారు. ఆ ట్వీట్లలో నారా లోకేశ్ వివరిస్తూ, “పరిశ్రమలు, ఉపాధి క‌ల్పనా రంగాల‌ని సంక్షోభంలోకి నెట్టే ప‌వ‌ర్‌ హాలిడేని ఎత్తేయాలంటూ సీఎం జ‌గ‌న్ గారికి లేఖ రాశాను. 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏనాడు కరెంట్ కోతలు లేవు. కానీ మీరు సీఎం అయ్యాక విద్యుత్ రంగాన్ని నాశనం చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు.

ప‌రిశ్రమల్లో ఉత్పత్తి నిలిపివేయడం ద్వారా నెలవారీ అద్దెలు, చెల్లించాల్సిన వాయిదాలు, అప్పుల‌కు వడ్డీలు కట్టలేక యాజమాన్యాలు విల‌విల్లాడుతున్నాయి. విద్యుత్‌ కోతలతో గ్రానైట్‌, ఆక్వా, పౌల్ట్రీ, వ‌స్త్ర‌, ఆహార‌ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులతో స‌మీక్షించి ప‌వ‌ర్ హాలిడేని ఎత్తేసే మార్గం ఆలోచించండి. వాణిజ్య, పరిశ్రమల వినియోగదారుల నెత్తిన పెనుభారాన్ని మోపుతూ ఎనర్జీ డ్యూటీని 6 పైసల నుండి రూపాయికి పెంచి సుమారుగా రూ.3 వేల కోట్లు దోచుకునే నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుని ప‌రిశ్రమలని కాపాడండి” అని లోకేశ్ అందులో ప్ర‌స్తావించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/