గెలిచిన ముగ్గురు ఎమ్మెల్సీ లను శాలువాలతో సత్కరించిన లోకేశ్

ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన రాంగోపాల్ రెడ్డి, శ్రీకాంత్, చిరంజీవి

Nara Lokesh congratulates TDP MLCs on their recent election victory

అమరావతిః పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురు టిడిపి ఎమ్మెల్సీలను నారా లోకేశ్ ఈరోజు శాలువాలతో సన్మానించారు. వైఎస్‌ఆర్‌సిపి అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన రియల్ హీరోలంటూ వారిని ప్రశంసించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పట్టువదలకుండా మీరు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈమేరకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి ఈరోజు మర్యాదపూర్వకంగా లోకేశ్ ను కలిశారు. కదిరి నియోజకవర్గంలో జరుగుతున్న యువగళం యాత్రకు ముగ్గురు ఎమ్మెల్సీలు వచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు ముగ్గురినీ లోకేశ్ సత్కరించారు. ప్రజాసమస్యలపై మండలిలో పార్టీ గళం వినిపించాలని వారికి మార్గనిర్దేశం చేశారు. కాగా, తమపై నమ్మకం ఉంచి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి అవకాశం ఇచ్చిన లోకేశ్ కే తమ గెలుపును అంకితం చేస్తున్నట్లు ఎమ్మెల్సీలు తెలిపారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపిని గెలిపించుకోవడానికి లోకేశ్ ఆధ్వర్యంలో పనిచేస్తామని ఎమ్మెల్సీలు రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి పేర్కొన్నారు.