భ‌జ‌న చేసిన వారికే జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వులు ఇచ్చారంటూ లోకేష్ కామెంట్స్

ఏపీలో కొత్త మంత్రి వర్గం ఏర్పాటైన సంగతి తెలిసిందే. మొత్తం 25 మంత్రుల్లో 11 మంది పాతవారు కాగా 14 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు..తమ బాధ్యతలను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త మంత్రివర్గం ఫై నారా లోకేష్ పలు కామెంట్స్ చేశారు. జ‌గ‌న్ కొత్త కేబినెట్‌లోని మంత్రులంతా డమ్మీలేన‌ని , భ‌జ‌న చేసిన వారికే జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వులు కేటాయించార‌ని వ్యాఖ్యానించారు. ఏపీలో పెరిగిన విద్యుత్ చార్జీల‌కు నిర‌స‌న‌గా బుధ‌వారం మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన లోకేశ్.. ప్ర‌జ‌ల‌కు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వ విధానాల‌పై లోకేశ్ విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్ సీఎం అయ్యాక రాష్ట్రంలో అన్నింటి ధ‌ర‌లు పెంచుకుంటూ పోతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వచ్చే నెల‌లో విద్యుత్ బిల్లులు వ‌చ్చాక టీడీపీ ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్యేలు,. మంత్రుల ఇళ్ల‌ను ముట్ట‌డిస్తామ‌ని లోకేష్ హెచ్చరించారు. ఇక చంద్రబాబు సైతం ఆర్టీసీ ఛార్జీల పెంపు ఫై జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. డీజిల్‌ సెస్‌ పేరుతో ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలన్నారు. వైసీపీ పాలనలో రెండోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారని చంద్రబాబు గుర్తు చేశారు. విలీనం అయ్యాక ఆర్టీసీకి అండగా నిలవాల్సింది ప్రభుత్వమేనన్నారు. ప్రతివారం ఛార్జీలు, పన్నులు పెంచడం అలవాడుగా మారిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే విద్యుత్‌, చెత్త, ప్రాపర్టీపై పన్నుల భారం వేశారని, పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.