‘నాన్న..బాబాయ్’ నాకు రెండు కళ్లు – రామ్ చరణ్

‘నాన్న నాకు ఎడమ కన్ను అయితే..బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ కుడి కన్నుతో సమానం. ఇద్దరు నాకు వేర్వేరు కాదు’ అన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ మూవీ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న చరణ్..తాజాగా అమెరికా నుండి హైదరాబాద్ కు వచ్చారు. అమెరికా నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లి అక్కడ కేంద్ర మంత్రి అమిత్ షా ను కలిశారు. ఆ తర్వాత చరణ్‌ ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ 2023 సెషన్‌లో పాల్గొన్నారు. ఆ వేదికపై ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా, ఆస్కార్‌ తదితర అంశాలతోపాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ కథ అనుకున్నప్పుడు రాజమౌళి తారక్‌ని, నన్ను ఎంచుకోవడానికి కారణం మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం. కథ కూడా ఇద్దరు స్నేహితులకు సంబంధించినది కావడంతో మా ఇద్దరికి కరెక్ట్‌గా మ్యాచ్‌ అవుతుందని గమనించి మా ఇద్దరినీ సెలక్ట్‌ చేసుకున్నారని తెలిపారు. 92 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఇండస్ట్రీ నుంచి ఈ స్థాయికి వెళ్లిన సినిమా లేదు. నామినేషన్‌ వరకూ వెళ్లి ఉండొచ్చు కానీ ఈ స్థాయి క్రేజ్‌ వెళ్లింది మాత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’సినిమానే. ఇది జక్కన్న చేసిన మ్యాజిక్‌. ‘నాటునాటు’ పాట అంతగా పాపులర్‌ అయింది అంటే దీని వెనుక ఎంతోమంది కష్టం ఉందన్నారు.

14 ఏళ్ల క్రితం రాజమౌళి ‘మగధీర’తో నాకు బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌, తెలుగు ఇండస్ట్రీకి ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చారు. వర్క్‌లో ఆయన మిస్టర్‌ పర్ఫెక్ట్‌. ఆయనచేసే పనిని ఎంత గౌరవిస్తారో నాకు బాగా తెలుసు. మా నాన్న.. బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ తర్వాత నేను ఎక్కువగా గౌరవించే వ్యక్తి ఒక్కరే! ఆయనే రాజమౌళి. ఇక మా ఇంట్లోకి వెళ్తే మా నాన్న నాకు ఎడమ కన్ను అయితే.. బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ కుడి కన్నుతో సమానం. ఇద్దరు నాకు వేర్వేరు కాదు’’ అని తెలిపారు.