బింబిసార ఈవెంట్ లో అపశృతి..నందమూరి అభిమాని మృతి

కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కుతున్న బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బింబిసారా చిత్రం ఆగస్టు 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అట్టహాసంగా జరిపారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. కాగా ఈ వేడుకలో నందమూరి అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిది తాడేపల్లిగూడెంకు చెందిన పుట్టా సాయిరామ్ గా గుర్తించారు.

పుట్టా సాయిరామ్ కూకట్‌పల్లిలో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు. కాగా నిన్న జరిగిన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన సాయిరామ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దాంతో మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ మృతిపై పూర్తి వివరాల కోసం పోలీసులు విచారణ చేపడుతున్నారు.

ఇక బింబిసార విషయానికి వస్తే..ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. శ్రీ వశిష్ట్ దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ మూవీ గా రానున్న ఈ మూవీ లో కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్, వారీనా హుస్సేన్ హీరోయిన్లు గా నటించగా.. వెన్నెల కిషోర్ , బ్రహ్మాజీ , శ్రీనివాస రెడ్డి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం సమకూర్చగా.. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.