నమస్కారం .. ఒక సంస్కారం!

చరిత్ర చెప్పిన పాఠాలు-

namaskar- a culture
namaskar- a culture

మనదేశంలో నమస్కారం ఒక సంస్కారం. పెద్దలకు, కొత్తగా పరిచయం అయిన వారికి నమస్కరించటం ఆనవాయితీ.

రాను రాను పాశ్చాత్య పోకడలను అనుసరిస్తూ నమస్కరించటం కంటే కరచాలనం చేయటం అలవాటయిపోయింది.

పెద్దలకు, పిన్నలకు, పాత మిత్రులు కలిసినప్పుడు, ఇంటర్వ్యూలకు వెళ్లినపుడు కరచాలనం చేయటం జీవితంలో భాగం అయింది.

అయితే ఇలా కరచాలనం లేదా షేక్‌ హ్యాండ్‌ ఇచ్చే సంప్రదాయం ఈనాటిది కాదు. దేశాలను బట్టి, ప్రాంతాలను బట్టి, ఈ ఆచారంలో మార్పులు చేర్పులు ఉంటాయి.

గ్రీటింగ్స్‌ చెప్పుకోవటం కూడా ఇంచుమించు ఇటువంటివే. మనిద్దరం పరస్పరం కలిసాం అని చెప్పుకునేందుకు గుర్తుగా ఒకరి చేతులు మరొకరు మృదువుగా నొక్కి వదిలేస్తారు.

కొందరు తగిలి తగిలినట్లుగా వేళ్లు మాత్రం తగిలించి వదిలేస్తారు. ఇంకొందరు చేతిలో చేయి వేసి గట్టిగా నొక్కుతూ ఉంటారు. మరికొందరు కేవలం చేతి వేళ్లు మాత్రమే కలుపుతారు. కొందరు తన ఎడమచేతిని అవతలి వ్యక్తి ఎడమచేతితో కలుపుతారు.

ఈ విధంగా చేసేది స్కౌట్స్‌ మాత్రమే. ఎడమచేతివాటం ఉన్నవారు కూడా సాధారణంగా కుడిచేతితోనో షేక్‌హాండ్‌ ఇస్తారు.

ఎందుకంటే అవతలి వాడు తమకు ఎడమచేతితో షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం అవమానంగా భావించే అవకాశం ఉంది. మైత్రిపూర్వకంగా ఇచ్చే షేక్‌హాండ్‌ మాత్రం మృదువుగా హాయిగాను ఉంటుంది.

అవతలి వారి కరస్పర్శ మనకు హాయినివ్వాలి. వారికి స్వాంతనను ఇవ్వాలి. అంతేగాని ముళ్లకంచె గుచ్చినట్లుగా ఉండకూడదు. కొందరు తన బలాన్నంతా చేతిలోకి తెచ్చుకుని దృతరాష్ట్ర కౌగిలి మాదిరిగా అవతలి వారి చేతిని నలిపి వదిలేస్తారు. ఇంకొందరు సుతారంగా నొక్కి వదిలేస్తారు.

చేతులు కలిపి కలవనట్లుగా కరచాలనం చేయడం అవమానకరంగా, అవతలి వారు అంటే మనకు ఇష్టం లేనట్లుగా ఉంటుంది. కరచాలనం చేయడానికి ఒక పద్ధతుంది.

కరచాలనం చేసేందుకు చేతిని చాపే విధానం, అవతలి వారి చేతిపై ఎంత ఒత్తిడిని ఉపయోగిస్తున్నాం అన్నది. అలాగే అవతలి వారి చేతిని మన చేతిలో ఎంత సేపు ఉంచుకున్నాము అని ఇలా మూడు అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి.

కరచాలనం ఇచ్చేటప్పుడు ఎదుటివారి కళ్లలోని స్నేహపూర్వకంగా చూడాలి. అంతేకాని ఎటో చూస్తూ కరచాలనం ఇవ్వకూడదు.

అలాగే అంటి ముట్టనట్లు చేతులు తగిలించడం కూడా మంచి పద్ధతి కాదు. కరచాలనం చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చేయాలి. అంటే అలా చేయి తగిలి తగినట్లుగా తగిలించడం మంచిది కాదు.

కరచాలనం ఇవ్వటం కూడా ఒక కళ అయినప్పటికీ నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా అందరూ మన సంస్కృతి సంప్రదాయాలను అవలంభిస్తున్నారు.


చేయి కలిపితే కరోనా వస్తుంది అనే భయంతో విదేశీయులు సైతం నమస్కారం అంటున్నారు. ఏది ఏమైనా కరోనా మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు నేర్పినందుకు గర్వపడాలి.

  • వేణుగీతిక

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/