ఈ మద్దతును చూసి జగన్ ప్రభుత్వం భయపడుతోంది : నక్కా

అమరావతి రైతుల పాదయాత్రకు అన్ని గ్రామాల నుంచి మద్దుతు వస్తోంది: నక్కా ఆనందబాబు

అమరావతి : అమరావతి రైతుల పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. తిరుపతి వరకు చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రైతుల పాదయాత్రకు అన్ని గ్రామాల నుంచి మద్దతు లభిస్తోందని చెప్పారు. పాదయాత్రకు వస్తున్న మద్దతును చూసి జగన్ ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. కేవలం అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లోనే రైతుల ఉద్యమం ఉందని భావించిన వైసీపీ నేతలకు… పాదయాత్ర పొడవునా వస్తున్న ఆదరణ చూసి నోళ్లు మూగబోయాయని చెప్పారు.

రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లాలనుకునే నేతలను పోలీసులు గృహనిర్బంధం చేయడం దారుణమని ఆనందబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని… ఈ అంశంలో కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని విమర్శించారు. రైతుల పాదయాత్రను ఆపాలని ప్రభుత్వం అనుకుంటే… అమరాతిని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/