వైస్సార్సీపీ నేతలు కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు: నక్కా

ఎమ్మెల్సీ అనంతబాబును సస్పెండ్ చేసినట్టు వైస్సార్సీపీ డ్రామా ఆడిందన్న ఆనంద్ బాబు

అమరావతి : దళితులపై వైస్సార్సీపీకి ఉన్నది కపట ప్రేమ అని టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు అన్నారు. మాజీ డ్రైవర్ ను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని సస్పెండ్ చేసినట్టు వైస్సార్సీపీ డ్రామా ఆడిందని విమర్శించారు. గడప గడపకు కార్యక్రమంలో అనంతబాబు ఫొటోకు పాలాభిషేకం చేయడం దొంగ సస్పెన్షన్ కాక మరేమిటని ప్రశ్నించారు. అనంతబాబు ఫొటోలను ఊరేగించిన ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య నేపథ్యంలో వచ్చిన ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే కోనసీమ, అమలాపురం అల్లర్లను సృష్టించారని అన్నారు.

హత్య కేసు నుంచి అనంతబాబును తప్పించేందుకు శత విధాలా ప్రయత్నించారని నక్కా ఆనందబాబు విమర్శించారు. అయితే సుబ్రహ్మణ్యం కుటుంబం, ప్రతిపక్షం ఆందోళనలతో కేసు పెట్టక తప్పలేదని తెలిపారు. అంబేద్కర్ ను అల్లర్లలోకి లాగడం సిగ్గు చేటని అన్నారు. దళిత ఓటు బ్యాంకు దూరమవుతున్నందుకే వైస్సార్సీపీ నేతలు కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని చెప్పారు. అసలు పచ్చని కోనసీమ తగలబడటానికి జగనే కారణమని ఆరోపించారు. ఇది సీఎం కార్యాలయం ఒక పథకం ప్రకారం ఆడిన కుట్ర అని చెప్పారు. కోనసీమ అల్లర్లలో వైస్సార్సీపీ నేతలను పోలీసులు నిందితులుగా ప్రకటిస్తే… జగన్ మాత్రం అల్లర్లకు ప్రతిపక్షం కారణమని అంటున్నారని ఎద్దేవా చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/