పదేళ్ల తరువాత సాగర్‌ అన్ని గేట్ల ఎత్తివేత

ఎగువ నుంచి 7.6 లక్షల  క్యూసెక్కులకు పైగా ప్రవాహం
మరో రెండు రోజుల పాటు వరద

Nagarjuna Sagar dam
Nagarjuna Sagar dam

నాగార్జునసాగర్ : దాదాపుగా పదేళ్ల తర్వాత నాగార్జునసాగర్‌లో 24 గేట్లు ఎత్తారు. ఎగువ నుంచి ఉధృతంగా వస్తున్న ప్రవాహాలతో సాగర్ నుంచి కాస్త ముందుగానే నీటిని గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు 766080 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, దిగువకు 367580 క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాలకు 834000 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీటికి తుంగభద్ర నుంచి వస్తున్న నీరు తోడవడంతో శ్రీశైలానికి వచ్చే ప్రవాహం ఘననీయంగా పెరుగనుంది. శ్రీశైలంకు ప్రస్తుతం 820000 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా, 850000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర రిజర్వాయర్‌కు 244000 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుంటే, 213000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. సుంకేషుల బ్యారేజి నుంచి సాయంత్రం 6 గంటల సమయంలో 210000 క్యూసెక్కులు గేట్లు తెరిచి శ్రీశైలానికి వదిలారు. నాగార్జునసాగర్‌లో 312 టిఎంసిలకు గాను 250 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

అయితే ఎగువ నుంచి భారీ స్థాయిలో వస్తున్న నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా దిగువకు నీటిని గేట్లు ఎత్తి వదులుతున్నారు. ఇదిలా ఉండగా ఆల్మట్టికి 570000 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా, దిగువకు 540000 క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్‌కు 590000 క్యూసెక్కులు వస్తుంటే, 600000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. భీమా నదిపై ఉజ్జయిని డ్యాంకు సైతం 68000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో స్థిరంగా వస్తుంటే, దిగువకు 110000 క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాలకు 834000 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుంటే, దిగువకు 827000 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇదేవిధంగా దిగువ గోదావరి బేసిన్‌లో నీటి ప్రవాహం భారీగా వస్తుంది. ఎగువ గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులు మాత్రం నీటి కోసం ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్నాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/