నాగాలాండ్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు..అసెంబ్లీ ఎన్నికల్లో తొలి మహిళ విజయం

న్యూఢిల్లీః నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ అభ్యర్ధి గెలిచి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఎన్‌డీపీపీ అభ్యర్ధి హెకానీ జఖాలు విజయం సాధించారు. గత 60 ఏళ్లలో నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్ధి గెలవడం తొలిసారి కావడం విశేషం. దిమాపూర్ -3 నియోజకవర్గం నుంచి హెకానీ జఖాలు 1536 ఓట్లతో గెలుపొందారు. నాగాలాండ్ అసెంబ్లీలో ఆరు దశాబ్దాల తరువాత ఓ మహిళ ఎమ్మెల్యే అడుగుపెట్టబోతున్నారు. మరోవైపు మేఘాలయా అసెంబ్లీ స్పీకర్ మెట్బా లింగ్డో కూడా ఘనవిజయం సాధించారు. యూడీపీ అభ్యర్ధిగా బరి లోకి దిగిన మెట్బా లింగ్డో 155 ఓట్లతో గెలుపొందారు.
మరోవైపు ఈనాశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. నాగాలాండ్‌లో బిజెపి, ఎన్డీపీపీ కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఈ కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ఈ కూటమి 25 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్‌పీఎఫ్ 2 చోట్ల గెలిచి మరో 2 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఎన్‌పీపీ ఒక చోట గెలిచి.. 2 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు ఆరు స్థానాల్లో గెలిచి.. మరో 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.