పవన్ సీఎం అయ్యేవరకు కార్యకర్తగానే ఉంటా – నాగబాబు

మెగా బ్రదర్ , జనసేన పార్టీ పీఏసీ సభ్యులు నాగబాబు …పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేవరకు పార్టీ లో కార్యకర్తగానే పనిచేస్తానని తెలిపారు. శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా నాగబాబు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలి..? పార్టీ సిద్దాంతాలను ప్రజలకు ఎలా వివరించాలి..? అనే విషయాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాగబాబు సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో బలంగా ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్రంలో అమూల్యమైన వనరులు ఉన్నా.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, ప్రజా ఆమోద పరిపాలన అందించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దోపిడీకి గురవుతున్న రాష్ట్ర ఆర్థిక వనరులు, ప్రకృతి సంపదను కాపాడే సమర్థత జనసేన పార్టీకి మాత్రమే ఉందన్నారు.

‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి జనసేన దగ్గర వినూత్నమైన ప్రణాళికలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే అవినీతి అనే పదమే వినపడకుండా ప్రజా ప్రయోజన పరిపాలన అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకూ నేనూ ఒక కార్యకర్తగా పని చేస్తా.. రానున్న ఎన్నికలే లక్ష్యంగా గ్రామీణ స్థాయిలో విస్తరించి పని చేయాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు అంతా సమష్టిగా పని చేయాలి..’ అని నాగబాబు సూచించారు. ఇక అక్టోబర్ నెలలో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర కొనసాగనుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపే లక్ష్యంగా పవన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.