అల్లూరి వేడుకల్లో చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారంటూ నాగబాబు ఎద్దేవా..

భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ.. 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌, సినీ నటుడు చిరంజీవి , ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ సభపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేసారు.

‘మన్యం వీరుడు “అల్లూరి సీతారామరాజు” విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది, ఆ మహానుభావుడికి నా నివాళి. ఆ సభ లో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ అద్భుతంగా పెరఫార్మెన్సు చేశారు,,. ఆ మహనటులంంరికి ఇదే నా అభినందనలు’అంటూ సెటైర్లు పేల్చారు. ఈ కార్యక్రమానికి జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకాని సంగతి తెలిసిందే.

నాగబాబు ట్వీట్‌పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్‌లు అవసరమా అంటూ మెగా బ్రదర్‌ తీరును తప్పుబడుతున్నారు. అసలు ఎవరి గురించి కామెంట్ చేశారనే అనుమానాలు వ్యక్తం చేశారు. మొత్తానికి నాగబాబు చేసిన ట్వీట్‌తో మరో దుమారం రేగిందనే చెప్పాలి.

ఇదిలా ఉంటె ఈ వేడుకలకు సంబంధించి వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలతో పంచుకున్నారు. కార్యక్రమ ముఖ్యాంశాలను వివరిస్తూ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు అర్పించడం జరిగిందని మోడీ పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో తెలుగులో తన ప్రసంగాన్ని మొదలు పెట్టి అందరినీ ఆకట్టుకున్నారు మోడీ. అల్లూరి పుట్టిన గడ్డ అంటూ కొనియాడారు. ‘ మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు, తెలుగు వీర లేవరా, దీక్షబూని సాగర, స్వతంత్ర సంగ్రామంలో యావత్ భారతానికి స్పూర్తిగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేల మీద మనం అందరం కలుసుకోవడం మన అదృష్టం’ అంటూ మాట్లాడారు. తెలుగు వీర లేవరా అంటూ శ్రీశ్రీ పాటను ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఇదొక పుణ్య భూమి, వీర భూమి అన్నారు. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయ్యిందన్నారు. ఏడాది పాటు వేడుకలు నిర్వహించుకోవాలన్నారు.