హ్యాట్రిక్ కొట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేసిన నాగ శౌర్య

దర్శకుడు శ్రీనివాస్ అవసరాల – నాగశౌర్య కలయికలో తెరకెక్కిన మూవీ ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’. గతంలో వీరిద్దరి కలయికలో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు వచ్చి చక్కటి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరోసారి వీరి కలయికలో సినిమా వస్తుండడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ లో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 17 న గ్రాండ్ గా విడుదల కాబోతున్న నేపథ్యంలో శనివారం చిత్ర ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది.

ఈ సందర్బంగా నాగశౌర్య మాట్లాడుతూ … ” ఈ సినిమా చూసిన తరువాత ఇంతకుముందు మా కాంబినేషన్లో వచ్చిన సినిమాలను మరిచిపోతారు. అంతలా ఈ సినిమా మరిపిస్తుంది. అవసరాల దర్శకత్వం పై నాకు నమ్మకం ఎక్కువ. రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన మేము, మూడో బ్లాక్ బస్టర్ తప్పకుండా కొడతాము” అని ధీమా వ్యక్తం చేసారు. ” సినిమా గురించి మేము మాట్లాడితే డప్పు కొట్టుకుంటున్నారు అనుకుంటారు. కానీ మేము డప్పు కొట్టుకోము. ఒక సినిమా కోసం ఎంత కష్టపడ్డామనేది మీకు చెప్పవలసింది మేమే కదా. అవసరాల ఎప్పుడూ కూడా హిట్టు గురించి గానీ .. ఫ్లాప్ గురించి గాని మాట్లాడరు. ఎప్పుడూ స్క్రిప్ట్ గురించే మాట్లాడటం ఆయన ప్రత్యేకత” అని చెప్పుకొచ్చాడు.