పేర్ని నాని సెటైర్లఫై నాగబాబు ఘాటైన కౌంటర్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ది వీకెండ్‌ ప్రజాసేవ అంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. నాని నోటి విరేచనాలతో బాధపడుతున్నాడని , పవన్ కళ్యాణ్ పెట్టే ఆహారం జీర్ణం కాకపోవడంతో ఆయన ఈ సమస్యను ఎదుర్కొంటున్నారంటూ నాగబాబు ట్వీట్ చేశారు. వైసీపీ నేతలకు అప్పుడప్పుడు కొంచెం సాఫ్ట్ ఫుడ్ పెట్టాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను రిక్వెస్ట్ చేస్తున్నా… బందరులో పేర్ని నానికి చేరువగా ఎవరైనా డాక్టర్ ఉన్నారా? అని నాగబాబు ట్వీట్ చేశారు.

సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో వైస్సార్సీపీ ప్లీనరీ గురించి మాట్లాడిన నాని ..ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫై సెటైర్లు వేశారు. ‘పక్షానికో సారి సెలవు రోజున పవన్‌కల్యాణ్‌ ప్రజాసేవ.. పవన్‌.. షూటింగ్‌లకే కాదు.. రాజకీయాల్లోనూ ఆలస్యమే. పవన్‌ అసెంబ్లీ గేటు ముట్టుకోవటమనేది ప్రజలు నిర్ణయిస్తారు’’ అని పేర్ని నాని అన్నారు. ప్రజల కోసం తనను తాను దహించుకుపోవడానికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్ వ్యాఖ్యల పట్ల స్పందించిన నాని.. శుభ్రంగానే ఉన్నావ్ కదా..? ఏం దహించుకుంటావ్..? ఈ మూడేళ్ల నుంచి ఏం దహించుకున్నావ్..? హాయిగా సినిమాలు చేసుకుంటున్నావ్ కదా.. బండ్లలో సోకుగా తిరుగుతున్నావ్ కదా.. అంటూ సెటైర్లు వేశారు.