6 వేల వేతనం..వారి కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారు? : నాదెండ్ల
మత్స్యకారుల సమస్యలపై జనసేన నేత నాదెండ్ల

అమరావతి: జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జనసేన మత్స్య వికాస విభాగం ఆధ్వర్యంలో ఆ పార్టీ మత్స్యకార అభ్యున్నతి యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”నిన్న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలో పర్యటించాం. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి వచ్చిన తర్వాత వాటిని అమ్మిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటారు. మత్స్యకార గ్రామాల్లో తాగునీటి పథకం అమలు చేశారో లేదో ప్రభుత్వం చెప్పాలి. మహిళలు పడుతోన్న కష్టాలు తెలుసుకుంటే చాలా ఆవేదన కలిగించింది. జగన్ కూడా యాత్ర చేయాలి. మత్స్యకారుల ఆరోగ్య సమస్యల గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకు మత్స్యకారులు ఇతర జిల్లాలకు వలస వెళ్తున్నారు? శ్రీకాకుళం, విశాఖ నుంచి 25 వేల మంది ఎందుకు వలస వెళ్లారు?
నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను.. నాకు చాలా బాధకలిగించింది. చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్నారు. ఆరు వేల రూపాయల వేతనం మాత్రమే వారికి వస్తోంది. ఆ డబ్బుతో వారి కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారు? చెత్తపై కూడా పన్ను వేశారు. సూర్యారావు పేటలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి, 560 కుటుంబాలను రోడ్డున పడేశారు. అయినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎందుకు స్పందన రావట్లేదు? మా యాత్ర ఇంకా తొమ్మిది రోజులు ఉంటుంది. మత్స్యకారులకు న్యాయం చేయాలి. గతంలో చేపలు అమ్ముకునేవాళ్లమని, తమ షాపులన్నింటినీ తీసేశారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా సమస్యలపై మరింత సమాచారం సేకరించి, ఈ నెల 19న పవన్ కల్యాణ్ గారికి నివేదిక అందిస్తాం. ఆ తర్వాత 20వ తేదీన బహిరంగ సభ నిర్వహిస్తాం. ప్రభుత్వ తీరుపై మాట్లాడడానికి ప్రజలు భయపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమేనా?” అని నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/