మా మంత్రుల‌కు హిందీ రాదు.. మిజోరం సీఎం

కేంద్రానికి మిజోరం సీఎం లేఖ‌

గౌహ‌తి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు మీజోరం సీఎం పూ జోరంతంగలేఖ రాశారు. త‌మ క్యాబినెట్‌లో ఉన్న మంత్రుల‌కు హిందీ భాష రాదు అని, అయితే మీజో భాష తెలియ‌ని చీఫ్ సెక్ర‌ట‌రీతో ఇబ్బంది అవుతోంద‌ని, అందుకే సీఎస్ రేణూ శ‌ర్మ‌ను మార్చాల‌ని సీఎం త‌న లేఖ‌లో కోరారు. గ‌తంలో త‌న వ‌ద్ద అద‌న‌పు సీఎస్‌గా చేసిన జేసీ రామ్‌తంగ‌ను కొత్త సీఎస్‌గా నియ‌మించాల‌ని ఆయ‌న ఆ లేఖ‌లో అభ్య‌ర్థించారు. మీజో ప్ర‌జ‌ల‌కు హిందీ భాష అర్థం కాదు అని, క్యాబినెట్‌లో ఉన్న మంత్రుల‌కు ఒక్క‌రికీ హిందీ రాదు అని, కొంద‌రికి ఇంగ్లీష్ భాష‌తోనూ స‌మ‌స్య ఉంద‌ని సీఎం అన్నారు.

అయితే హిందీ, ఇంగ్లీష్ రాని మంత్రుల‌తో.. మీజో భాష తెలియ‌ని వ్య‌క్తి చీఫ్ సెక్ర‌ట‌రీగా ప‌నిచేయ‌డం ఇబ్బందిగా మారుతుంద‌ని సీఎం త‌న లేఖ‌లో తెలిపారు. న‌వంబ‌ర్ ఒక‌టో తేదీన మీజో సీఎస్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించాల‌ని రేణూ శ‌ర్మ‌కు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అలాగే అదే రోజున సీఎస్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని అద‌న‌పు సెక్ర‌ట‌రీ జేసీ రామ్‌తంగ‌ను సీఎం జోరంతంగ ఆదేశించారు. దీంతో ఇప్పుడు ఆ రాష్ట్రానికి ఇద్ద‌రు సీఎస్‌లు ఉన్నారు. ఈ నేప‌థ్యంలో త‌న అభ్య‌ర్థ‌న‌ను స్వీక‌రించి, సీఎస్‌ను మార్చాల‌ని సీఎం జోరంతంగ లేఖ‌లో కోరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/