‘పప్పు’ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ

అప్పుడు మా నానమ్మ ఇందిరను కూడా అలాగే పిలిచారు..ఆ తర్వాత ‘గుంగి గుడియా’.. ‘ఉక్కు మహిళ’గా మారారు..రాహుల్

rahul-gandhi

న్యూఢిల్లీః ప్రతిపక్షాలు రాహుల్ గాంధీని ‘పప్పు’ అని విమర్శిస్తూ ఉంటాయి. ఈ వ్యాఖ్యలపై రాహుల్ ఎప్పుడూ స్పందించలేదు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్ తొలిసారి ‘పప్పు’ విమర్శలపై స్పందించారు. ‘ది బాంబే జర్నీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పప్పు’ వ్యాఖ్యలను తాను పట్టించుకోబోనని అన్నారు. తనను అలా పిలవడం ద్వారా వారు తమలోని భయాన్ని బయటపెట్టుకుంటున్నారని అన్నారు. వారు అలా పిలవడం బాగానే ఉందని, మరింతగా పిలవాలని సూచించారు. భారత్ జోడో యాత్ర ముంబైలో జరుగుతున్న సమయంలో ఆయన ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా, ఇది వెలుగులోకి వచ్చింది. కాగా, ప్రస్తుతం యాత్రకు బ్రేక్ ఇచ్చారు. జనవరి 3 నుంచి తిరిగి ప్రారంభం అవుతుంది.

ఆ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. ఎవరు ఎలాగైనా పిలుచుకోవచ్చని, తాను పట్టించుకోబోనని అన్నారు. తన నానమ్మ ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతూ.. ఇందిరను ‘ఉక్కు మహిళ’గా పిలవడానికి ముందు ఆమెను ‘గుంగి గుడియా’ (మూగబొమ్మ) అని పిలిచేవారని గుర్తు చేసుకున్నారు. తనను ఇప్పుడు 24 గంటలూ ‘పప్పు’ అని పిలుస్తున్న వారే అప్పుడామెను ‘గుంగి గుడియా’ అని పిలిచేవారన్నారు. ఆ తర్వాత ఆ ‘గుంగి గుడియా’ ఒక్కసారిగా ‘ఉక్కు మహిళ’గా మారారని అన్నారు. తన జీవితంలో ఆమె ప్రేమను నింపారని, ఆమె తన రెండో తల్లి అని అన్నారు.

ఆమె (ఇందిర) లాంటి గుణగణాలు ఉన్న స్త్రీ జీవితంలో మీరు స్థిరపడాలని కోరుకుంటున్నారా?.. అన్న ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. ‘‘ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. నా తల్లి, నానమ్మ లాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడం మంచి లక్షణం’’ అని బదులిచ్చారు.

కాగా, ఈ నెల 24న రాహుల్ భారత్ జోడో యాత్ర ఢిల్లీకి చేరుకుంది. ప్రస్తుతం విరామం ప్రకటించగా, జనవరి 3న కశ్మీర్ గేట్ నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. జమ్మూకశ్మీర్‌లో ఆయనతోపాటు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కలిసి నడుస్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/