మటన్ ప్రియులకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు..అతి త్వరలో మటన్ క్యాంటీన్లు ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలోని మటన్ ప్రియులకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు అందించింది. అతి త్వరలో మటన్ క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకరాబోతున్నారు. ఈ విష‌యాన్ని స్టేట్ షిప్ అండ్ గోట్ డెవ‌ల‌ప్‌మెంట్ కో ఆప‌రేటివ్ ఫెడ‌రేష‌న్ తెలిపింది. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం ద్వారా మాంసం ఉత్పత్తులు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో మాంసం ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం సమయతమైంది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించే మటన్ క్యాంటీన్లలో ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

ఈ మ‌ట‌న్ క్యాంటీన్ల‌లో మ‌ట‌న్ బిర్యానీతో పాటు పాయ‌, గుర్దా ఫ్రై, ప‌త్తార్ కా గోస్ట్, కీమా వంటి రుచిక‌ర‌మైన వంట‌కాలు అందుబాటులో ఉండ‌నున్నాయి. అయితే మొద‌టి క్యాంటీన్‌ను కో ఆప‌రేటివ్ ఫెడ‌రేష‌న్ కార్యాల‌యం ఉన్న శాంతిన‌గ‌ర్ కాల‌నీలో ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ క్యాంటీన్ వ‌చ్చే నెల‌లోనే ప్రారంభం కానుంది. అయితే మెనూ ధ‌ర‌లు ఖ‌రారు కాన‌ప్ప‌టికీ, స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే మట‌న్ వంట‌కాల‌ను అందుబాటులోకి తేనున్నారు. తొలి దశలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మటన్ క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ ఇటీవల నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీతో భేటీ అయ్యారు. మటన్ క్యాంటీన్ల నిర్వహణకు జీహెచ్‌ఎంసీ నుంచి సహకారం అందించాలని కోరారు. హైదరాబాద్‌లో మటన్ క్యాంటీన్లు విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫిష్ క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఫిష్ క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఫిష్ క్యాంటీన్లలో ప్రస్తుతం ఫిష్ కర్రీ, ఫిష్ బిర్యానీ, ఫిష్ ఫ్రై వంటి వెరైటీ వంట‌కాలు అందుబాటులో ఉన్నాయి.