తిరుమల శ్రీవారికి ముస్లిం ఫ్యామిలీ భారీ విరాళం

muslim family donates rs 1 crore to tirumala srivaru

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి ముస్లిం దంపతులు భారీగా విరాళం అందజేసి వార్తల్లో నిలిచారు. చెన్నైకి చెందిన సుబీనా బాను, అబ్దుల్‌ ఘనీ దంపతులు తమ పిల్లలతో కలిసి మంగళవారం రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాతలు విరాళం చెక్కును టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.

ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు, ఇటీవల తిరుమలలో ఆధునికీకరించిన శ్రీపద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నీచర్‌, వంటశాలలో పాత్రలకు రూ.87 లక్షలు విరాళంగా అందజేశారు. అంతకుముందు ఈ దంపతులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ఇటీవలే రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ శ్రీవారి హుండీకి రూ. 1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. తాజాగా చెన్నైకి చెందిన ముస్లిం దంపతులు రూ.1.02 కోట్ల భారీ విరాళం అందజేశారు. కాగా, తిరుమల శ్రీవారు అంటే మొదటి నుంచి ముస్లింలకు ప్రత్యేక భక్తి భావన ఉంది. శ్రీవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు.