గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ : హుస్సేన్‌ సాగర్ గేట్లు ఎత్తివేత

గులాబ్ తుఫాన్ కారణంగా మరోసారి హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆగకుండా కురస్తున్న వర్షాలతో ట్యాంక్‌ బండ్‌లో నీటి మట్టం 514.75 అడుగులకు చేరింది. దీంతో అధికారులు గ్లేట్లను ఎత్తి నీటిని కిందికి వదలారు. వరద నీరు భారీగా దిగువకు వస్తుండడంతో లోయర్ ట్యాంక్ బండ్‌ సహా సిటీలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు. ట్యాంక్‎బండ్‌కు దిగువ ప్రాంతాలైన కవాడీగూడ, లోయర్ ట్యాంక్ బండ్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మరోపక్క GHMC అధికారులు కిందిస్థాయి సిబ్బందిని అలర్ట్ చేశారు. GHMC కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. సిటీ శివార ప్రాంతాలు సహా.. అన్నిచోట్ల భారీ వర్షం పడుతోంది. ఇప్పుడు పడుతున్న వర్షాన్ని చూస్తే.. 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం పడొచ్చన్న అంచనాలున్నాయి. చత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ వరకు గులాబ్‌ తుఫాన్ ప్రభావవం ఉందని, రేపు ఉదయం వరకు వర్షం కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పరిస్థితిని సీఎస్, కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణలో 14 జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్,జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీచేసింది. అలాగే ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ హెచ్చరికలు జారీచేసింది. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన జిల్లాల్లో మంగళవారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు.