ముంబయి ఇండియన్స్‌ సరికొత్త రికార్డు

mumbai indians team
mumbai indians team

ముంబయి: మూడుసార్లు ఐపిఎల్‌ ఛాంపియన్‌…రెండు సార్లు ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేత…మరోసారి ఐపిఎల్‌ ఫైనలిస్టు…ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో రికార్డులు ముంబయి ఇండియన్స్‌ సొంతం…ఐపిఎల్‌ చరిత్రలో మరే జట్టు సాధించలేని రికార్డులు ముంబయి సాధించింది. 2013లో తొలిసారిగా ఐపిఎల్‌ ఛాంపియన్‌గా అవతరించింది. తర్వాత 2015, 2017లో టైటిల్‌ గెలుచుకుంది. ఐపిఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ను మట్టికరిపిస్తూ…కొరకరాని కొయ్యలా తయారైందీ జట్టు. ఐపిఎల్‌లో ప్రతిసారి ఫేవరెట్‌గా దిగే ముంబయి ఇండియన్స్‌ ఈసారి కూడా విజేతగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. బుధవారం వాంఖడే వేదికగా చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. లీగ్‌లో 100వ విజయం నమోదు చేసింది. ఐపిఎల్‌ ప్రారంభం నుంచి ముంబయి ఇండియన్స్‌ 175 మ్యాచ్‌లాడితే అందులో 100 మ్యాచుల్లో విజయం సాధించింది. 56.85శాతం విజయాలు సొంతం చేసుకుంది. ముంబయి తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఉన్నాయి.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/