అలాగైతే ..10,000 మంది ఉద్యోగాలు కోల్పోతారు

వొడాఫోన్‌ ఐడియా రూ. 2 లక్షల కోట్ల నష్టాల్లో ఉంది

mukul rohatgi
mukul rohatgi

న్యూఢిల్లీ: గత పదేళ్లలో వొడాఫోన్‌ ఐడియా రూ 2 లక్షల కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందని, ప్రభుత్వానికి పేరుకుపోయిన బకాయిలను రాత్రికి రాత్రి చెల్లిస్తే కంపెనీ మూతపడుతుందని సంస్థ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ స్పష్టం చేశారు. సంస్థ మూతపడితే 10,000 మంది ఉద్యోగాలు కోల్పోతారని, 30 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లకు అసౌకర్యం వాటిల్లుతుందని చెప్పుకొచ్చారు. ఇది టెలికాం రంగంలో పోటీతత్వం కనుమరుగై రెండు సంస్థల ఆధిపత్యమే కొనసాగేందుకు దారితీస్తుందని అన్నారు. ప్రభుత్వానికి వొడాఫోన్‌ ఐడియా రూ 7000 కోట్ల బకాయిలుండగా పెనాల్టీ, వడ్డీపై పెనాల్టీలతో కలుపుకుని ఇవి రూ 25,000 కోట్లకు ఎగబాకాయి. కంపెనీ ఇప్పటికే రూ 2150 కోట్లు చెల్లించిందని ముకుల్‌ రోహత్గీ చెప్పారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు నష్టాలతో సతమతమవుతున్న టెల్కోలు సంక్షోభంలో కూరుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. బకాయిలను రాత్రికిరాత్రే చెల్లించే అవకాశం లేదని టెల్కోలు టెలికాం శాఖకు తేల్చిచెప్పాయని, ప్రభుత్వం సైతం పరిస్థితికి తగినట్టు వ్యవహరించాలని లేనిపక్షంలో టెలికాం రంగంలో మోనోపలీకి దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/