ప్రపంచ కుబేరుడు ముఖేష్‌ అంబానీ

వార్తల్లోని వ్యక్తి ( ప్రతిసోమవారం)

Mukesh Ambani-Nita Ambani

ప్రపంచ కుబేరుడు రిలయెన్స్‌ సంస్థ అధ్యక్షుడు ముఖేష్‌ అంబానీ అంతర్జాతీయ వ్యాపార రంగంలో మొన్న మరో అడుగు ముందుకు వేశారు. ఆయనకు చెందిన జియో సంస్థలో మరో ప్రపంచ వాణిజ్య సంస్థ ‘ఫేస్‌బుక్‌ 43 కోట్ల 574 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టింది!

ధీరుఁభాయ్ అంబానీకి ఇద్దరు కుమారులు- ముఖేష్‌, అనిల్‌. తండ్రి తమకిచ్చిన వ్యాపార ఆస్తిలో ముఖేష్‌ దినదినాభివృద్ధి చెంది, ఏకంగా ప్రపంచ కుబేరుడుగా ప్రకాశిస్తుండగా, రెండవ వాడు ‘మినుకుమినుకు మంటున్నాడు!

మరి, ఇద్దరూ ఆ తండ్రి బిడ్డలే. ముఖేష్‌ మట్టిముట్టుకుంటే బంగారమౌతుంది. అనిల్‌ కో? బంగారాన్ని తాకితే మట్టి! వీరిద్దరి తండ్రి ధీరుఁభాయ్ .

గల్ఫ్‌ దేశంలోని ఏడెన్‌లో ఒక పెట్రోలు బంక్‌లో వచ్చిపోయే కార్లకు నూనెపోసే ఉద్యోగం! అలాంటిది, ఆయన స్వదేశమైన భారత వచ్చి, ఇక్కడ రిలయెన్స్‌ సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ దినదిన ప్రవర్థమానమై, మొక్కగా మొలిచి, మర్రి చెట్టు అయి కూర్చున్నది.

అన్నదమ్ములు ముఖేష్‌, అనిల్‌ తండ్రి ఆస్తిపాస్తులను పంచుకోగా, పెద్దవాడు ఆకాశాన్ని అందుకోడానికి అడుగులేస్తుండగా, చిన్నవాడు నానాటికీ చితికిపోయి, చతికిలపడుతున్నాడు, దురదృష్టం కాక మరేమిటి?

ముఖేష్‌ 1957 ఏప్రిల్‌ 19న ఏడెన్‌లో జన్మించాడు. ముంబాయి యూనివర్శిటీ నుంచి ఆయన కెమికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, తరువాత అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఎమ్‌.బి.ఏ డిగ్రీ చదివినా, పూర్తి చేయలేదు.

ప్రపంచంలోని అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారాన్ని ఆయన 2007లో నెలకొల్పారు. అది సామాన్యమైనదా? రోజుకు 6,60,000 బారెల్స్‌ నూనెను శుద్ధి చేస్తుంది. ముఖేష్‌ అధీనంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, అంతేకాక, ముంబాయిలో తండ్రి పేరిట ధీరూబా§్‌ు అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూలును స్థాపించారు.

ముఖేష్‌ భార్య నీతా కూడా పేరెన్నికగన్న పారిశ్రామికవేత్త. భర్తకు దీటైన మేధాశక్తి. రిలయెన్స్‌ సంస్థ పారిశ్రామిక నిర్మాణశక్తిది 10 లక్షల టన్నుల నుంచి సంవత్సరానికి 120 లక్షల ఉత్పత్తి పాటవానికి పెరగడంలో ఆమె పాత్ర చాలానే వుంది.

భార్యకు భర్త కాన్కలు!

నీతా దంపతులకు ముగ్గురు సంతానం. భార్య 44వ జన్మదినోత్సవం సందర్భంగా ముఖేష్‌ ఆమెకు ఆరుకోట్ల డాలర్ల విలువైన ‘ఎయిర్‌ బస్‌ వంటి రమ్యహర్మ్యాన్ని బహూకరించాడు!

అంతేకాదు- ప్రపంచంలోనే అద్భుతమైన నూరుకోట్ల డాలర్ల విలువైన మరో దివ్యభవనంలో (ముంబాయి) వీరి కుటుంబం నివసిస్తున్నది.

ముఖేష్‌కు ప్రపంచంలోని అత్యున్నత వ్యాపార అవార్డులన్నీ లభించాయి. కాగా, అంతర్జాతీయ ప్రఖ్యాత పత్రిక ‘ఫోర్బ్స్‌లో దాదాపు ప్రతి సంవత్సరం ‘ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్‌మెన్‌గా ఆయన పేరు ఉండవలసిందే!

ఈ సంవత్సరం కూడా ఉండడంలో ఆశ్చర్యమేమున్నది? ముఖేష్‌ అంబానీ వయస్సు ఈ ఏప్రిల్‌ 19కి 62 సంవత్సరాలు పూర్తి అయినాయి. దీర్ఘాయుష్మాన్‌ భవ! ముఖేష్‌ జీ!

-డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు, (‘పద్మశ్రీ ‘అవార్డు గ్రహీత)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/