అస్సాంకు ముకేశ్ అంబానీ రూ. 25 కోట్ల సాయం

భారీ వరదలతో అస్సాం రాష్ట్రం అతలాకుతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ , ఆయన తనయుడు అనంత్ అంబానీ రూ. 25 కోట్ల సాయం అందించారు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌ కు అందించారు. ఈ సాయంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. అంబానీ అందించిన సాయాన్ని కొనియాడుతూ ఓ ట్వీట్ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రూ. 25 కోట్లు విరాళమిచ్చి అస్సాం ప్రజల తరపున నిలబడ్డారంటూ ప్రశంసించారు.

ఈశాన్య రాష్ట్రం అసోంలో వరద బీభత్సం అతలాకుతలం చేసింది.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఏకమై లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మొత్తం 29 జిల్లాల్లోని 2,585 గ్రామాలకు చెందిన 8 లక్షల మందికి పైగా వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జమునాముఖ్‌ జిల్లాలోని చాంగ్జురై, పటియా పాథర్‌ గ్రామాలు పూర్తిగా నీటమునిగిపోయాయి. దీంతో ఆ గ్రామాలకు చెందిన 500లకు పైగా కుటుంబాలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని రైల్వే ట్రాక్‌లపై రోజులు గడుపుతున్నాయి. వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. లక్షల ఎకరాల్లోని పంటలు నాశనమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్న ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా పలువురు తమ వంతు సాయం అందజేస్తున్నారు.

అస్సాం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 11 మంది మరణించారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వార్తా సంస్థ ఏఎన్ ఐ నివేదించింది. వర్షాలు, వరదల నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రెండుసార్లు ఫోన్ చేశారు. తొలి ఫోన్ కాల్‌లో వరద పరిస్థితిపై ఆరా తీయగా, రెండో ఫోన్ కాల్‌లో వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం త్వరలో రాష్ట్రానికి రానుందని సమాచారం. ఈశాన్య రాష్ట్రమైన అస్సాం గత వారం రోజులుగా విధ్వంసకర వరదల ప్రభావంలో చిక్కుకుంది. 36 జిల్లాల్లో 33లో దాదాపు 43 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఈ ఏడాది అసోంలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 73 మంది చనిపోయారు.