సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన ఫై బిజెపి ఎంపీ లక్ష్మణ్‌ కామెంట్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ..నిన్న బీహార్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. గల్వాన్‌ అమరవీరుల కుటుంబాలతోపాటు హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసేందుకు బీహార్ వెళ్లిన కేసీఆర్.. బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. అలాగే బీహార్ సీఎం నితీష్ తో భేటీ అయ్యి..జాతీయ రాజకీయాల ఫై చర్చించారు.

ఇక కేసీఆర్‌ బీహార్‌ పర్యటనపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌.. కేసీఆర్ బీహార్‌ పర్యటనపై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. బీహార్‌ పర్యటనతో కేసీఆర్‌ అభాసుపాలయ్యారు. కేసీఆర్‌ ఉచ్చులో నితీష్‌ కుమార్‌ చిక్కుకున్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యల ద్వారా మరోసారి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య బంధం బహిర్గతమైంది. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ ఎమర్జెన్సీ విధిస్తే.. నేడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్బంధాలు, ఆంక్షలు, అరెస్టులతో ఎమర్జెన్సీ తలపిస్తోంది.

తెలంగాణలో ధాన్యం కుప్పల మీద రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలను ఆదుకోని సీఎం కేసీఆర్‌.. బీహార్‌ వెళ్లి అక్కడి వారికి చెక్కులు ఇవ్వమేంటి?. కన్న తండ్రికి బువ్వపెట్టని కొడుకు.. మేనమామకు మంగళ హారతి పట్టిన చందంగా కేసీఆర్‌ తీరు ఉందని ఎద్దేవా చేశారు.