సొంత సోదరుడిపై ఎంపీ కేశినేని నాని పిర్యాదు..

సొంత సోదరుడి ఫై ఎంపీ కేశినేని నాని పిర్యాదు చేయడంతో అన్నదమ్ముల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు బట్టబయలు అయ్యాయి. నాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేశినేని నాని సొంత సోదరుడైన కేశినేని చిన్నిపై విజయవాడ ఫిర్యాదు చేయడం టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. తన పేరు, హోదాను ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని, నకిలీ వీఐపీ స్టిక్కర్‌తో విజయవాడ, హైదరాబాద్‌లలో తిరుగుతున్నారని, అలా తిరుగుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ వాహనం నంబరును టీఎస్07హెచ్07హెచ్ డబ్ల్యూ7777గా పేర్కొన్నారు నాని. మే 27నే కేశినేని నాని ఫిర్యాదు చేయగా, జూన్ 9న ఎఫ్ఐఆర్ నమోదైంది. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేశినేని నాని ఫిర్యాదు చేసిన వాహనాన్ని సోమవారం హైదరాబాద్ పోలీసులు గుర్తించి తనిఖీ చేయగా.. అన్నీ సవ్యంగానే ఉన్నట్లు గుర్తించి వదిలేశారు. అయితే, ఈ వాహనం నాని సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని వినియోగిస్తుండటం గమనార్హం. టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా నాని రెండుసార్లు విజయం సాధించడంలో సోదరుడు చిన్ని పాత్ర కూడా ఎంతో ఉంది. ప్రచారంలో ఆయన సోదరుడికి అండగా ఉన్నారు. ఇటీవల ఆయన టీడీపీలో క్రియాశీలంగా ఉంటున్నారు. విజయవాడ పార్లమెంటు స్థానానికి ఆయన ప్రత్యామ్నయా అభ్యర్థిగా ఎదగాలనుకుంటున్నారని, వారి మధ్య విభేదాలకు ఇదే కారణమన్న చర్చ జరుగుతోంది.