తెలంగాణ జోలికి రావొద్దు అంటూ సజ్జల కు వార్నింగ్ ఇచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్

ఏపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పిటిషన్ ఆధారంగా తిరిగి రెండు రాష్ట్రాలు కలిపి ఉంచాలనే పరిస్ధితి సుప్రీంకోర్టు లో వస్తే దాన్ని వైస్సార్సీపీ స్వాగతిస్తుందన్నారు. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో తమ వాదనలు బలంగా వినిపిస్తామన్నారు. రాష్ట్ర విభజనను పునఃసమీక్షించాలి.. లేదా సరిదిద్దాలని కోరతామన్నారు. విభజన జరిగిన తీరుపైనే కేసు వేశారని, హామీల అమలు కోసం కాదని.. విభజన హామీల అమలు కోసం ఏపీ ప్రభుత్వం పోరాడుతోందని సజ్జల స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు కలిసే అవకాశాన్నీ ఏపీ సర్కార్ ఉపయోగించుకుంటుందని, ఇరు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సిందేముందన్నారు.

సజ్జల స్టేట్‌మెంట్లపై తెలంగాణ రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే టిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల నేతలు ఘాటుగా స్పందించగా..తాజాగా బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం సజ్జల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం జగన్ తన సలహాదారుడిని మార్చుకోవాలని చెప్పారు. సజ్జలను ఎవరైనా సలహాదారుడిగా పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. ‘ఒకప్పుడు తమిళనాడు నుంచి అంధ్రప్రదేశ్ విడిపోయింది. మళ్లీ అంధ్రను తమిళనాడులో కలుపుకోవాలని చెప్పాలి అంతేతప్ప తెలంగాణ జోలికి రావొద్దు’ అంటూ మండిపడ్డారు.