ప్రకృతిమాత

ఆధ్యాత్మిక చింతన

nature
nature

సువక్షోజ కుంభాం సుధాపూర్ణ కుంభాం
ప్రసాదావలంబాం ప్రపుణ్యావ లంబామ్‌
సదాస్యేందు బింబాం సదోనోష్ట బింబాం
భజే శారదాంబా మజస్రం మదం బ్యాయ్

ఇది శ్రీశారదాభుజంగ ప్రయాతాష్టక స్తోత్రమ్‌లోని మొదటి శ్లోకం.

దీని అర్ధము కుంభములవంటి వక్షోజములు కలదియు, అమృత భాండము ధరించినదియు, ప్రసాదము పుణ్యము ఆవలంబముగా గలదియు, ముఖముపై బాలేందు రేఖ కలదియు.

బింబము వంటి పెదవి కలదియు, మా తల్లియునగు శారదాంబను సదాసేవింతును. ఒక భక్తుడు తల్లిగా తాను సదా ఎవరిని భావిస్తాడో ఆ దేవతను స్తుతిస్తూ చెబుతున్న శోక్లమిది.

కుంభము, కుండ ఇలాంటి మాటలు వినపడిన వెంటనే వాటితో పాటు మనకు నీరు, పాలు, అమృతం లాంటివి కూడా గుర్తుకువస్తాయి. కొందరికి సారాయి, కల్లు లాంటివి కూడా గుర్తుకువస్తాయి.

మనుషులు జీవించటానికి ఆహారం కంటే కూడా నీరు ముఖ్యం. ఆహారం లేకుండా నలభై రోజులు జీవించ వచ్చునట. నీరు లేకుండా నాలుగు రోజులు జీవించలేము. అంత ముఖ్యమైనది నీరు.

ఒక పాలు చూద్దామా దాన్ని సంపూర్ణ ఆహారం అంటారు. బలాన్ని ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. ఇక అమృతాన్ని గురించి అది ఉందో లేదో చెప్పలేము గానీ ఉంటే మాత్రం ప్రపంచంలో ఉన్న అన్నిటికన్నా మంచిదిట అది.

ఇక సారాయి, కల్లు విషయమంటే చిక్కుల్లో ఉన్నవాళ్లకు మనశ్శాంతినిచ్చేవి అవేగా. ఏది ఏమైనా కుంభము, కుండ అను మాటలు అన్నీ మంచి వస్తువులనే మనకు గుర్తు చేస్తాయి.

ఒక సువక్షోజ అను మాటకు వద్దాం. దాని అర్ధం భౌతికంగా గుండుగా పెద్దగా ఉండు రొమ్ము అని కాదు.

సంతానంగా ఉన్న శిశువుకు బొజ్జనిండుగా సంతృప్తిగా పాలనిచ్చి వెచ్చదనాన్ని హాయినిచ్చునదనే అర్ధం.

కన్న పిల్లలకు బొజ్జనిండా పాలు ఇవ్వలేని వక్షోజం అది భౌతికంగా ఎలా ఉన్నా ఏమి ప్రయోజనం? అది సువక్షోజమెలా అవుతుంది?

ఒక భక్తుడు శారదాదేవిని కీర్తిస్తున్నా, పార్వతీదేవిని కీర్తిస్తున్నా, లక్ష్మీదేవిని కీర్తిస్తున్నా.

సరస్వతీ దేవిని కీర్తిస్తున్నా సువక్షోజమను పదాన్ని వాడితే అతడు నిజంగా కీర్తిస్తున్నది ప్రకృతి మాతనే అని, ప్రకృతి మాత తన సంతానమైన సర్వజీవరాశుల కడుపునింపే సమర్ధత గల తల్లి అని గుర్తించాలి.

నిజానికి ఈ ప్రపంచంలో ఆహారము దొరక్క మరణించే జీవి ఏదీ ఉండదు. ఒక్క మనిషి తప్ప,
మనిషి తన స్వార్థంతో తనకు తాను ఆ దుస్థితిని తెచ్చుకున్నాడు.

సర్వజీవరాశిని సమృద్ధిగా ఆహారాన్నిచ్చి, కడుపునింపి, పెంచి, పోషించే ఆ ప్రకృతి మాతను, ఆ మాతను సూచించే ఇతర దేవతా మూర్తులను అలా వర్ణిం చటంలో ..

తమను తాము ఆ మాతకు కన్న బిడ్డలుగా భావించే భక్తులు అలా వర్ణించటంలో తప్పేముంది? భావం ముఖ్యం. వారిది సద్భావమే.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/