నాలుగు రోజుల్లో ముగ్గురు ప్రముఖులను పోగొట్టుకున్న టాలీవుడ్

తెలుగు చిత్రసీమలో వరుస విషాదాలను అందర్నీ షాక్ కు గురి చేస్తున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ప్రముఖులను కేవలం నాల్గు రోజుల్లో పోగొట్టుకుంది తెలుగు చిత్రసీమ. నవంబర్‌ 27న ప్రముఖ దర్శకుడు కేఎస్‌ నాగేశ్వరరావు గుండెపోటు తో కన్నుమూశారు. ఆ తర్వాత నవంబర్‌ 28న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ కరోనా తో కన్నుమూశారు. ఇక ఈరోజు (నవంబర్ 30) ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ కొద్దీ సేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఇలా ముగ్గురు ప్రముఖులు కేవలం నాల్గు రోజుల వ్యవధిలో కన్నుమూయడం చిత్రసీమను శోకసంద్రంలో పడేసింది.

ఈ నెల 24న న్యూమెనియాతో సీతారామశాస్త్రి కిమ్స్ హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అయితే మంగళవారం పరిస్థితి విషమించడంతో సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు. వైద్య బృందం ఆయన త్వరగా కోలుకునేందుకు ఎప్పటికప్పుడు మెరుగైన వైద్యం అందిస్తున్నా పరిస్థితి చేయిదాటిపోయింది. సీతారామశాస్త్రి మరణవార్త విని సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని అనుకుంటుండగా.. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడం సిరివెన్నెల పాటలను ప్రేమించే కోట్లాది అభిమానులను కలిచివేస్తోంది.