వైద్యుడి నిర్లక్ష్యం వల్ల 500మందికి హెచ్ఐవీ

రటోడెరో: పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో దారుణం చోటుచేసుకుంది. వైద్యుడి నిర్లక్ష్యంగా కారణంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 500 మందికి పైగా హెచ్ఐవీ బారిన పడ్డారు. అయితే వివరాల ప్రకారం.. సింధ్ ప్రావిన్స్‌లోని లర్కానా జిల్లాలో గత నెల అనేక హెచ్ఐవీ కేసులు నమాదయ్యాయి. అయితే వీరిలో చాలా మంది చిన్నారులే ఉండటంతో ప్రొవిజినల్ హెల్త్ అధికారులు అప్రమత్తమై జిల్లా వ్యాప్తంగా రక్తపరీక్ష శిబిరాలు ఏర్పాటుచేశారు. ఈ శిబిరాల్లో చిన్నారులు, గ్రామస్థులకు రక్తపరీక్షలు చేశారు. ఆ రిపోర్ట్లు చూసిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.500మందికి పైగా హెచ్ఐవీ బారిన పడ్డట్లు గుర్తించారు. వీరిలో దాదాపు 400 మంది చిన్నారులే కావడం గమనార్హం.దీంతో దర్యాప్తు చేపట్టగా.. హెచ్ఐవీ సోకిన చిన్నారులంతా గత నెల్లో స్థానిక చిన్న పిల్లల వైద్యుడు ముజఫర్ ఘంగర్ ప్రయివేటు క్లినిక్‌కు వెళ్లినట్లు తెలిసింది. దీంతో అతడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కలుషిత సిరంజీని పిల్లలకు ఉపయోగించడం వల్లే వారికి హెచ్ఐవీ సోకినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేగాక ముజఫర్.. రటోడెరోలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా విధులు నిర్వర్తిస్తున్నాడు. అక్కడ కూడా అతడు నిర్లక్ష్యంగానే వ్యవహరించాడట. ఒకే సిరంజీని అనేక మందికి ఉపయోగించినట్లు తెలిసింది. పైగా ముజఫర్ కూడా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు కావడం గమనార్హం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/